మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యం

– రాయపర్తి ఏపీఎం కిరణ్ కుమార్
నవతెలంగాణ – రాయపర్తి
డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఏపీఎం కిరణ్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల సమైక్య భవనంలో స్వయం సహాయక సంఘం సభ్యులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి మహిళలను గుర్తించి నైపుణ్యాలకు అనుగుణంగా ఉండే వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకుల, శ్రీనిధి ద్వారా వడ్డీ లేని రుణాలు అందించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నాము అని తెలిపారు. డ్వాక్రా సంఘాల వారికి మెరుగైన అవగాహన కనిపించి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వయం సహాయ సంఘాల సభ్యులను లక్షధికారులుగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ పత్ దీదీ అనే పథకాన్ని పార్లమెంటులో ఆమోదపరచడం జరిగిందన్నారు. మొదటగా రాజస్థాన్ రాష్ట్రంలో పథకాన్ని అమలు చేశారని అతి త్వరలో తెలంగాణలో సైతం అమలు చేయడం జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యుల ఆదాయం ఒక సంవత్సరానికి కనీసం లక్ష రూపాయలు వచ్చే విధంగా వ్యాపారాలు చేయుటకు శిక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ కోఆర్డినేటర్ ప్రేమ్ రాజ్, అంగన్వాడీ టీచర్లు, సీసీలు, విఓఏలు, మండల సమైక్య పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.
Spread the love