- లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్
నవతెలంగాణ-హైదరాబాద్: సమాజ్‌వాదీ పార్టీ అధినేత, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ మంగళవారం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పరీక్షల పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు వద్ద విలేకరులతో మాట్లాడిన యాదవ్, పరీక్షా పత్రాల లీకేజీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు సరైంద కాదని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు బల ప్రయోగం చేయడం ఏంటని తప్పుబట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవీకి రాజీనామా చేయకుండా ఇంకా ఆలస్యం చేయడం సమంజసం కాదని, వెంటనే ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
“పరీక్షా పత్రాలు లీక్ కాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఇంతటి దారుణం జరిగిన తర్వాత కూడా సభలో నినాదాలు చేయాల్సి వస్తోంది, దీనికంటే సిగ్గుచేటు విషయం మరొకటి ఉంటుందా? ప్రభుత్వ లాఠీల దెబ్బలకు యువత, విద్యార్థుల తలలు పగిలిపోతున్నాయి, మీరు బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు, విద్యుత్ షాకులు ఇస్తున్నారు. ఇదేనా ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’? ఇదేనా ‘అమృత కాలం’?” అని యాదవ్ పార్లమెంట్ మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు.



