రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలి

– విశాఖలో ప్రత్యేక పూజలు  మాజీ ఎంపీ,ఎమ్మెల్యే దంపతులు 

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని, మంచి పంటలు పండాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి సాధించాలని, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మి కాంతారావు సరోజినీ దేవి దంపతులు, హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ డాక్టర్ షమిత దంపతులు మంగళవారం విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహా స్వామి వారి, ఉత్తర పీఠాధిపతి శ్రీస్మాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం శ్రీ రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పండితుల మంత్ర పఠనం మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహా స్వామి వారు కెప్టెన్, సతీష్ కుమార్ దంపతులకు అందజేసి ఘనంగా వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కెప్టెన్, సతీష్ కుమార్ మాట్లాడుతూ.. అత్యంత పవిత్రమైన శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ శారదా పీఠాన్ని సందర్శించడం అలాగే అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం, పీఠాధిపతుల ఆశీర్వాదం పొందడం సంతోషంగా ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీ అర్ ఎస్ గెలుపొంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించాలని, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, రైతులు సుభిక్షంగా పాడిపంటలతో విలసిల్లాలని, అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు.
Spread the love