Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేయాలి

ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేయాలి

- Advertisement -

దీనికి ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయాలి
ఫార్మాసిటీ/ఫ్యూచర్ సిటీపై ప్రజాభిప్రాయ సేకరణ జ్యూరీ కమిటీ డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్ నగర్

​గత అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వం అధికారికంగా జీఓ జారీ చేయాలని ఫార్మాసిటీ/ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులపై ప్రజాభిప్రాయ సేకరణ చేసిన జ్యూరీ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ‘రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, తాటిపర్తి గ్రామంలో ఫార్మాసిటీ/ఫ్యూచర్ సిటీ’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజా విచారణకు సంబంధించిన జ్యూరీ నివేదికను ఆవిష్కరించారు. అనంతరం జ్యూరీ కమిటీ ప్రతినిధులు సీనియర్ జర్నలిస్టు వేమన వసంత లక్ష్మి మాట్లాడారు. తెలంగాణ ప్రజా జేఏసీ ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సహాయంతో తాము మరికొంత మందిని కలిసి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజాభిప్రాయం సేకరణ చేసినట్టు తెలిపారు. అనేక గ్రామాలు, తండాల్లో రైతులను కలిశామని, వారు ఫార్మాసిటీకి భూములు ఇవ్వడానికి అంగీకరించడం లేదని చెప్పారు. రైతుల భూములన్నింటినీ భూసేకరణ నుంచి పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేశారు. భూములు ఇవ్వని రైతుల పేర్లును వెంటనే భూ భారతి ఆన్‌‌లైన్‌ రికార్డుల్లో పునరుద్ధరించాలని, వారి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ హక్కులను పునరుద్ధరించాలని కోరారు.
మానవ హక్కుల వేదిక అధ్యక్షులు ఎస్.జీవన్ కుమార్ మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం సేకరించిన భూములను స్వాధీనం చేసుకోరాదన్నారు. గ్రామాల నుంచి భారీ యంత్రాలను తొలగించాలని, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, రైతులను బెదిరిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని గ్రామాల్లోకి ప్రవేశాన్ని నిషేధించాలని డిమాండ్‌ ‌చేశారు.
వ్యవసాయ కూలీలకు నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని కోరారు. రిటైర్డ్ తహసీల్దార్ వి.బాలాజీ మాట్లాడుతూ.. ఫార్మాసిటీ స్థానంలో మరో కొత్త ప్రాజెక్టుగానీ.. కంపెనీగానీ తీసుకొచ్చినా దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుగులో గ్రామాల్లో ఉంచాలని అన్నారు. గ్రామ సభలు నిర్వహించి స్థానిక నివాసితుల సమ్మతి ఉంటేనే తదుపరి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతినిధి డా.జి.విజయ్, కమిటీ అధ్యక్షులు కన్నెగంటి రవి, సరస్వతి కవుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -