లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవి

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవి– విపక్షాలకు ఇవ్వడం ఆనవాయితేనా?
– రాజ్యాంగం ఏం చెబుతుంది?
నవతెలంగాణ ప్రతినిధి జే.జగదీష్‌
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవి ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాలని, అప్పుడే లోక్‌సభ స్పీకర్‌ పదవి ఏకగ్రీవం అయ్యేందుకు తాము మద్దతిస్తామని ప్రతిపక్ష ఇండియా ఫోరం పార్టీలు షరతుపెట్టాయి. అధికార ఎన్డీఏ ఈ అంశంపై ఏకాభిప్రాయానికి ప్రయత్నించకపోవడం, ప్రతిపక్ష సభ్యుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉంటారని ప్రకటించకపోవడంతో ఇండియా ఫోరం స్పీకర్‌ పదవికి పోటీ చేసింది. దీంతో 50 ఏండ్ల తరువాత లోక్‌సభ స్పీకర్‌ పదవికి బుధవారం ఎన్నిక జరిగింది.
అసలు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవి ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందా? అసలు రాజ్యాంగం ఏం చెబుతోందో తెలుసుకుందాం… మోడీ సర్కార్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత డిప్యూటీ స్పీకర్‌ స్థానాన్ని ఐదేండ్ల పాటు ఖాళీగా ఉంచింది. లోక్‌సభ అధికారిక వెబ్‌సైట్‌లో సైతం 2019 నుంచి డిప్యూటీ స్పీకర్‌ స్థానం ఖాళీగా ఉన్నట్టు చూపిస్తుంది.
డిప్యూటీ స్పీకర్‌ లేకుండా 17వ లోక్‌సభ
స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి 17వ లోక్‌సభ (మోడీ సర్కార్‌ రెండోసారి అధికారంలో ఉన్న సమయం) డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే నడిచింది. ఆ పదవి అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 93 ప్రకారం తప్పనిసరి. కానీ మోడీ సర్కార్‌ రాజ్యాంగ నిబంధనలను కూడా పక్కనబెట్టి, ఐదేండ్ల పాటు డిప్యూటీ స్పీకర్‌ పదవిని భర్తీ చేయకుండా మొండిగా వ్యవహరించింది. అయితే 17వ లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణలు కూడా జరిగాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 93 ప్రకారం లోక్‌సభ సభ్యులలో ఇద్దరిని స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ ఎన్నిక తేదీని రాష్ట్రపతి ఖరారు చేస్తారు. స్పీకర్‌ను ఎన్నుకున్నప్పుడే, డిప్యూటీ స్పీకర్‌నూ ఎన్నుకుంటారు. ఇది సాధారణంగా కొత్త లోక్‌సభ రెండో సెషన్‌లో నిర్వహిస్తారు. 1952 నుంచి 1969 వరకు అధికార పార్టీ కాంగ్రెస్‌ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులను నిర్వహించింది. 1952లో కాంగ్రెస్‌కు చెందిన అహ్మదాబాద్‌ ఎంపీ జివి మావలంకర్‌ (1952-56) మొదటి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. అప్పుడు మొదటి డిప్యూటీ స్పీకర్‌గా కాంగ్రెస్‌కు చెందిన చిత్తూరు ఎంపీ ఎంఎ అయ్యంగార్‌ వ్యవహరించారు. ఆ తరువాత 1956 నుంచి 1962 వరకు కూడా ఆయనే స్పీకర్‌గానూ, హుకమ్‌ సింగ్‌ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. 1962 నుంచి 1967 వరకు హుకమ్‌ సింగ్‌ స్పీకర్‌గానూ, ఎస్వీ కృష్ణమూర్తి రావు డిప్యూటీ స్పీకర్‌గానూ వ్యవహరించారు. 1967 నుంచి 1969 వరకు నీలం సంజీవ్‌ రెడ్డి స్పీకర్‌గా, రఘునాథ్‌ కేశవ్‌ ఖదిల్కర్‌ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. ఇక్కడి వరకు అధికార పార్టీ సభ్యులే స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులను నిర్వహించారు. అయితే 1969లో మార్పు వచ్చింది. 1969 (నాలుగో లోక్‌సభ మధ్య)లో స్పీకర్‌గా గుర్డియాల్‌ సింగ్‌ ధిల్లాన్‌ వ్యవహరించగా, ఆల్‌ పార్టీ హిల్‌ లీడర్స్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన గిల్బర్ట్‌ జి స్వేల్‌ (అప్పుడు ఆయన మణిపూర్‌లోని షిల్లాంగ్‌ ఎంపీ)కు డిప్యూటీ స్పీకర్‌ పదవి కట్టబెట్టారు. ఈ డిప్యూటీ స్పీకర్‌ పదవి కూటమిలో భాగస్వామికి లేదా, ప్రతిపక్షానికి ఇచ్చే సంప్రదాయం అప్పటి నుంచే మొదలైంది.
1969లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి లోక్‌సభ స్పీకర్‌ నీలం సంజీవ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌లో చీలిక నేపథ్యంలో ఈ నిర్ణయం ముందుకు వచ్చింది. ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పంజాబ్‌ నుంచి గెలుపొందిన కాంగ్రెస్‌ ఎంపీ గుర్డియాల్‌ సింగ్‌ ధిల్లాన్‌ను లోక్‌సభ స్పీకర్‌గా చేసింది. గిల్బర్ట్‌ జి స్వేల్‌ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించారు. 1977లో జనతా పార్టీ తరపున నీలం సంజీవ రెడ్డి లోక్‌సభ స్పీకర్‌ కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన ఏపికి చెందిన ఎంపీ గోడే మురహరికి డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చింది. 1980లో కాంగ్రెస్‌ మిత్ర పక్షమైన తమిళనాడుకు చెందిన డీఎంకేకు చెందిన ఎంపీ జి. లక్ష్మణ్‌ డిప్యూటీ స్పీకర్‌ అయ్యారు. తరువాత 1984లో రాజీవ్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీకి డిప్యూటీ స్పీకర్‌ పదవినిచ్చింది. ఆ పార్టీకి చెందిన తంబిదురై డిప్యూటీ స్పీకర్‌ అయ్యారు.
1989లో కేంద్రంలో జనతాదళ్‌ నేతృత్వంలో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు కాంగ్రెస్‌కు చెందిన శివరాజ్‌ పాటిల్‌ డిప్యూటీ స్పీకర్‌ అయ్యారు. జనతాదళ్‌కు చెందిన రబీ రే స్పీకర్‌గా ఉన్నారు. తరువాత 1991లో పదో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. అప్పుడు స్పీకర్‌గా శివరాజ్‌ పాటిల్‌ ఉన్నారు. కర్ణాటక నుంచి బీజేపీ ఎంపీ ఎస్‌.మల్లికార్జునయ్యకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చారు. 1996లో జరిగిన ఎన్నికల్లో యూనైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్‌ ఎంపీ పీఏ సంగ్మా స్పీకర్‌గా, బీజేపీకి చెందిన సూరజ్‌ భాన్‌ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు.
1998-99, 1999-2004 రెండు లోక్‌సభల్లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఉంది. 1998 నుంచి 2002 వరకు టీడీపీకి చెందిన అమలాపురం ఎంపీ జీఎంసీ బాలయోగి స్పీకర్‌గా ఉన్నారు. తరువాత 2002 నుంచి 2004 వరకు శివసేన ఎంపీ మనోహర్‌ జోషి స్పీకర్‌గా ఉన్నారు. అయితే రెండు సందర్భాల్లో డిప్యూటీ స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎంపీ పీఎం సయిద్‌ ఉన్నారు.
యూపీఏ-1 (2004-09) ప్రభుత్వంలో స్పీకర్‌గా సీపీఐ(ఎం)కు చెందిన సోమనాథ్‌ ఛటర్జీ ఉండగా, పంజాబ్‌కు చెందిన ఎన్డీఏ భాగస్వామి పార్టీ శిరోమణి అకాలీదళ్‌కి చెందిన చరణ్‌జిత్‌ సింగ్‌ అత్వాల్‌ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. యూపీఏ-2 (2009-14) ప్రభుత్వంలో కాంగ్రెస్‌ ఎంపీ మీరాకుమారి స్పీకర్‌గా ఉండగా, బీజేపీకి చెందిన కరియా ముండా డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు.
2014లో మోడీ సర్కార్‌ హయాంలో బీజేపీ ఎంపీ సుమిత్రా మహాజన్‌ స్పీకర్‌గా ఉండగా, డిప్యూటీ స్పీకర్‌గా అన్నాడీఎంకేకు చెందిన తంబిదురై ఉన్నారు. 2019లో రెండోసారి మోడీ సర్కార్‌ అధికారంలోకి రాగా స్పీకర్‌గా ఓం బిర్లా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీగా పెట్టారు. ఐదేండ్ల పాటు ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. ప్రతిపక్షాలకు తగినంత బలం లేకపోవడంతో తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేయలేదు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు బలం పెరగడంతో డిప్యూటీ స్పీకర్‌ పదవిని డిమాండ్‌ చేస్తున్నాయి.
ఆర్టికల్‌ 95 ప్రకారం, స్పీకర్‌ లేనప్పుడు సభను, విధులను డిప్యూటీ స్పీకర్‌ నిర్వహిస్తారు. డిప్యూటీ స్పీకర్‌ కూడా లేకపోతే రాష్ట్రపతి నియమించిన లోక్‌సభ ఎంపీ సభను, విధులను నిర్వహిస్తారు. ఆర్టికల్‌ 94 ప్రకారం స్పీకర్‌ రాజీనామా చేయాలనుకుంటే, తమ రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు అందజేస్తారు. అయితే ఈ అంశంపై సభలోనూ చర్చ జరిగింది. 1949లో హెచ్‌వి కామత్‌ స్పీకర్‌ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలని వాదించారు. స్పీకర్‌ ఆధీనంలో డిప్యూటీ స్పీకర్‌ ఉన్నందున, డిప్యూటీ స్పీకర్‌కు కాకుండా, తనను నియమించే వారికే రాజీనామా లేఖను అందజేయాలని వాదించారు. అందుకు బీఆర్‌ అంబేద్కర్‌ అంగీకరించలేదు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ సభ చేత నియమితులవ్వడం లేదా ఎన్నికవడం జరుగుతుంది. కనుక స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ తమ రాజీనామాల ను తమను నియమించే సభకు సమర్పించాల్సి ఉంటుందని అంబేద్కర్‌ అన్నారు. అలాగే సభకు ప్రాతినిధ్యం వహించే స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌కు రాజీనామాను అందజేయవచ్చని వాదించారు.

Spread the love