రాష్ట్రవ్యాప్తంగా ఎరువులు, విత్తనాల దుకాణాల బంద్ విజయవంతం : తెలంగాణ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు
నవతెలంగాణ- వరంగల్
ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జాతీయ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు దుకాణాలను మూసేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలోని అసోసియేషన్ భవనంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల కంపెనీలు యూరియా, కాంప్లెక్స్ ఎరువులతోపాటు అనవసరమైన ఇతర ఉత్పత్తులను (లింక్ ప్రొడక్ట్స్) డీలర్లకు బలవంతంగా అంటగడుతున్నాయని చెప్పారు. ఈ విధానాన్ని వెంటనే నిలిపివేసి, సదరు కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కంపెనీలు ‘ఫ్రాయిట్ ఆన్ లొకేషన్’ అమలు చేయకపోవడంతో, సుదూర ప్రాంతాల నుంచి రవాణా భారమై డీలర్లు ఆర్థికంగా నష్టపోతున్నట్టు చెప్పారు. మార్క్‌ఫెడ్ తరహాలోనే ప్రయివేటు డీలర్లకు కూడా ఈ సౌకర్యం కల్పించాలని, బినామీ పేర్లతో ఉన్న లైసెన్సులను రద్దు చేయాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులకు, గుర్తింపు పొందిన కంపెనీలకు మాత్రమే కొత్త లైసెన్సులు జారీ చేయాలన్నారు. నాణ్యత లేని విత్తనాలు, మందుల విషయంలో డీలర్లను బాధ్యులను చేయకుండా, వాటిని తయారు చేసిన కంపెనీలపైనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్‌టి బీటీ నియంత్రణ: నిషేధిత హెచ్‌టి బీటీ కాటన్ విత్తనాలు గ్రామాల్లోకి చేరకుండా ఉత్పత్తి కేంద్రాల వద్దే పోలీసు నిఘా కట్టుదిట్టం చేయాలని అన్నారు.
మార్క్‌ఫెడ్‌కు ఇచ్చే 60 శాతం కోటాలో లేని లింక్ ప్రొడక్ట్స్ నిబంధనను ప్రయివేటు డీలర్లకు ఇచ్చే 40 శాతం కోటాలో ఎందుకు పెడుతున్నారని, ఇది డీలర్లను మోసం చేయడమేనని వాపోయారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అనంతరం డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. త్వరలోనే ముఖ్యమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్టు నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రైతు సత్యనారాయణ రెడ్డి, గౌరీశెట్టి నాగరాజు, పున్నమి రాజేందర్ రెడ్డి, గాయత్రి రాంచంద్రా రెడ్డి, గుర్రం మధుసూదన్ రావు, అసోసియేషన్ జిల్లాస్థాయి నాయకులు అమూల్య ప్రవీణ్, పరమేశ్వర్, హరిందర్, రాజేశ్వర్‌రావు, రాజేంద్రయాదవ్, యాదగిరి, జగన్, సంపత్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఎలందర్ రెడ్డి, వెంకన్న, పైడి, ఆనందం పాల్గొన్నారు.
ఫర్టిలైజర్స్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



