మిర్యాలగూడ ఆర్డీఓకు వృద్ధ దంపతుల వినతి
ఆస్తి కోసం కొడుకు వేధిస్తున్నాడని ఆవేదన
రక్షణ కల్పించండి.. లేదంటే మరణానికి అనుమతి ఇవ్వండని వేడుకోలు
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
ఆస్తి కోసం కన్న కొడుకే తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడని, వేధింపులు తాళలేకపోతున్నామని, తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ ఓ వృద్ధ దంపతులను ఆర్డీఓను వేడుకున్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సోమవారం మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆర్డీఓ రమణారెడ్డికి విన్నవించుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శెట్టిపాలెం గ్రామానికి చెందిన గగ్గనపల్లి బుచ్చిరెడ్డి- అనసూయ దంపతులు తమ ఆస్తిని ఇద్దరు కొడుకులకు సమానంగా పంచారు. అయితే వృద్ధాప్యంలో పోషణ, వైద్య ఖర్చుల కోసం ఉంచుకున్న మూడెకరాల 11 గుంటల భూమిని తమను పోషిస్తున్న మనువడికి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమిలోనూ వాటా కావాలని పెద్దకొడుకు శ్రీనివాస్ రెడ్డి కుటుంబం వేధిస్తున్నది. గతంలో వీల్ చైర్‌లో ఉన్న బుచ్చిరెడ్డిపై పెద్ద కోడలు చెప్పుతో దాడి చేయడంతో కేసు నమోదైనా ఆమె తీరు మారలేదు. కేసు ఉపసంహరించుకోవాలని లేకపోతే ట్రాక్టర్‌తో తొక్కిస్తామంటూ బెదిరిస్తుండటంతో వేములపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుపై స్పందించాల్సిన ఎస్ఐ తిరిగి వృద్ధ దంపతులను బూతులు తిట్టాడు. దాంతో దిక్కులేక ఆర్డీఓను ఆశ్రయించారు. కొడుకు, కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక పోతున్నామని అధికారుల ముందు కన్నీరుపెట్టుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ తమకు న్యాయం చేయని పక్షంలో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఆర్డీఓను వేడుకున్నారు.
కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



