Monday, May 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

– ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి
– సెన్సెస్ – బి ఎల్ ఓ- సర్ లాంటి అదనపు పనుల నుండి మినహాయింపు ఇవ్వాలి
– సిఐటియు డిమాండ్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అంగన్వాడి,ఆశా వర్కర్స్‌కి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీలకు వేతనాలు రూ 18000/- లకు పెంచాలనీ, ఆశాలకు పారితోషకాలు రూ.18000/- ఫిక్స్ చేయాలని, ఫ్రీ – ప్రైమరీ,పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని,ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వేతనాలను ప్రతి నెల ఒకటో తేదీన చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సెస్ ( జనాభా లెక్కలు) బి ఎల్ ఓ డ్యూటీలు, సర్ లాంటి పనుల నుండీ అంగన్వాడీ, ఆశా వర్కర్లకు మినహాయింపు ఇవ్వాలని,ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు వినతి పత్రాన్ని అందజేయాలని అంగన్వాడి ,ఆశ యూనియన్ రాష్ట్ర కమిటీలు నిర్ణయం చేశాయి. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి నివాసంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, అంగన్వాడీ,ఆశా కార్యకర్తలతో కల్సి వినతిపత్రం అందజేయడం జరిగింది.
అదే విధానం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసే చర్యలను మానుకొని ప్రీ ప్రైమరీ పీఎంశ్రీ విద్యను అంగన్వాడీలకే ఇవ్వాలని డిమాండు చేశారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ 2020 లో కేంద్ర ప్రభుత్వం NEP చట్టాన్ని తెచ్చిందని దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన NEP చట్టాన్ని అమలు చేయడం సరైంది కాదని అన్నారు. ఐసిడిఎస్ లో 50 సంవత్సరాల నుండి పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ సేవలు అభినందనీయం అన్నారు.
ఐసిడిఎస్ నిర్వీర్యం అయితే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తో పాటు రాష్ట్రంలోనీ పేద ప్రజలందరికీ నష్టం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా గర్భిణీ బాలింతలు చిన్న పిల్లలకు ఐసిడిఎస్ యొక్క సేవలు కూడా దూరమవుతాయని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారం లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క విధానాలను వెనక్కి తీసుకోవాలని ఐసిడిఎస్ ను బలోపేతం చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
గత ప్రభుత్వం అధికారంలో ఉండి ఆశాలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయలేదు. ఇతర సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. అనేక హామీలు ఇచ్చి హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. కనీసం ప్రజాస్వామ్య హక్కులు కూడా లేకుండా కాలరాస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, నిర్బంధ పాలనను నిరసిస్తూ, అనేక పోరాటాలు నిర్వహిస్తుంటే పోరాటాలను అణిచివేస్తుంది. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ. 18 వేలు నిర్ణయించాలని ఇతర సమస్యల పరిష్కారం కోసం సరిపడా నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేస్తానని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ సమస్యలను ప్రస్తావిస్తానని తెలిపారు.
సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు పిలుపునిస్తోంది.
ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్, అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి శోభ రాణి, ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి రేవతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -