Monday, May 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డిలో భారీ చోరీ కేసు ఛేదన

కామారెడ్డిలో భారీ చోరీ కేసు ఛేదన

- Advertisement -

– అంతర్రాష్ట్ర హిస్టరీ షీటర్ అరెస్ట్ 
– రూ.42.50 లక్షల సొత్తు రికవరీ
నవతెలంగాణ –  కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా పోలీసులు భారీ చోరీ కేసును ఛేదించి అంతర్రాష్ట్ర హిస్టరీ షీటర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ.42.50 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలోని శ్రీ సాయి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివసించే అడ్డగుల్ల బాలకృష్ణ ఇంట్లో గత నెలలో భారీ చోరీ జరిగింది. బాధితుడు కుటుంబంతో హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో దుండగుడు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి 333 గ్రాముల బంగారు ఆభరణాలు, 10.290 కిలోల వెండి వస్తువులు, రూ.1 లక్ష నగదును ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నేర చరిత్రలను విశ్లేషించారు. దర్యాప్తులో నిందితుడు ‘డీజే డానీ’ అలియాస్ ఠాకూర్ జగన్ సింగ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడేవాడు. చోరీ చేసిన బంగారాన్ని విక్రయించేందుకు హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తుండగా జాతీయ రహదారిపై పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నిందితుడు తన పేరు ఠాకూర్ జగన్ సింగ్ @ దినేష్ సింగ్ @ డీజే డానీ అని తెలిపాడు. ఇతడు చోరీ చేసిన బంగారు ఆభరణాలను కరిగించి విక్రయించడం లేదా ఫైనాన్స్ సంస్థల్లో కుదువ పెట్టి డబ్బు సంపాదించేవాడని, ఆ డబ్బును గోవా వంటి ప్రాంతాల్లో జూదం, విలాసవంతమైన జీవనానికి ఖర్చు చేసేవాడని ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి 145 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.700 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నెక్లెస్‌లు, గొలుసులు, ఉంగరాలు, గాజులు, చెవి దిద్దులు, వెండి ప్లేట్లు, గ్లాసులు, పూజా సామగ్రి ఉన్నాయి. దర్యాప్తులో నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 32 ఆస్తి నేర కేసులు నమోదైనట్లు తేలింది. కరీంనగర్ జిల్లాలో 15, సైబరాబాద్ పరిధిలో 10, వరంగల్ జిల్లాలో 4, నిజామాబాద్‌లో 1, రామగుండం కమిషనరేట్ పరిధిలో 1, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇళ్లను ఎక్కువకాలం తాళం వేసి వెళ్లే సమయంలో సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కేసును ఛేదించిన డీఎస్పీ మధుసూదన్, టౌన్ సీఐ నరహరి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, ఎస్‌ఐలు, ఐటీ కోర్ సిబ్బంది సహా ప్రత్యేక బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -