నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు రైతు సంఘం వినతి
నవతెలంగాణ-వనపర్తి
జూరాల ఎడమ కాలువ కింద అమరచింత, ఆత్మకూర్, పెబ్బేర్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల రైతులు వరి నాట్లు వేసి రెండు మాసాలు అవుతుందని, ఈ కాల్వ ద్వారా సాగునీళ్ళు అందించి ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు జబ్బార్ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట పొట్ట దశలో ఉందన్నారు. సాగునీటి పారుదల శాఖ సాగునీరు ఆపిందన్నారు. జూరాల డ్యాంలో 8.5 టిఎంసి ల నీరు ఉందన్నారు.
ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడ్డాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రజలకు త్రాగునీటి కోసం ముందస్తుగా సాగునీరు ఆపటం సరైనది కాదన్నారు. రైతులు ఒక ఎకరాకుదాదాపు రూ. 50 వేలు ఖర్చు పెట్టి వరినాట్లు వేశారన్నారు. గత 8 రోజులుగా జూరాల ఎడమ కాలువ ద్వారా నీరు ఆపటం వల్ల వరిచేలు ఎండు దశల ఉన్నాయని, రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతారని తెలిపారు. పంటలు ఎండితే నీటిపారుదల శాఖ బాధ్యత వహించాలన్నారు. వెంటనే సాగునీరు వదిలి రైతుల పంటలు కాపాడాలని కోరుతున్నామని తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి..బాల్ రెడ్డి, జిల్లా నాయకులు జి ఎస్.గోపి ఉన్నారు.



