జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి..

– సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించిన టీఎస్ జెఏ నాయకులు
– మా డిమాండ్లన్నీ నెరవేర్చేంతవరకు పోరాటం కొనసాగిస్తాము..
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రాన్ మీడియా రంగంలో కొనసాగుతున్న 27 వేల మంది జర్నలిస్టుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ కనీసం ఐదు సంవత్సరాలకు పైబడి సీనియార్టీ ఉండి వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వమే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు.ఐదు సంవత్సరాల పైబడి వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ స్థలంలో పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు.ఏ ప్రాంతంలో పనిచేసినప్పటికీ ఆ జర్నలిస్టు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పోలీస్ శాఖ నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని యాదగిరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ప్రతి జర్నలిస్టు కుటుంబానికి అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని,ప్రతి జర్నలిస్టుకు 25 లక్షల ఉచిత ప్రమాద భీమా ఇవ్వాలని కోరారు.వృత్తిలో కొనసాగుతూ మరణించిన జర్నలిస్టు కుటుంబానికి నెలకు పదివేల రూపాయలు ఇవ్వడంతో పాటు ఆ జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలని కలెక్టర్ కు అందించిన వినతి పత్రంలో పొందుపరిచారు.ఎటువంటి వేతనాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు ఎంతో కాలంగా సేవ చేస్తూ ఇదే వృత్తిలో కొనసాగుతున్న ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఏడాదికి ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు,ఉచిత విద్యుత్తు ప్రతిరోజు లీటర్ పెట్రోల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సొంతభవనాలు లేని ప్రాంతంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించి ఇవ్వాలని యాదగిరి డిమాండ్ చేశారు.ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్టు పిల్లలకు అన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాలని దీన్ని సంబంధిత శాఖ అధికారులే ఆర్గనైజింగ్ చేయాలని కోరారు. విశ్రాంత జర్నలిస్టులకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జర్నలిస్టులకు నెలకు పదివేల రూపాయలు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ డిమాండ్లన్నీ నెరవేర్చేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.అనంతరం అసోసియేషన్ సభ్యులకు భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలను గూర్చి దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగంపల్లి నాగబాబు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ్ల రాము,రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొట్టే నాగరాజు యాదవ్,రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ బరిగెల విజయ్ కుమార్, హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు చిలుక సైదులు, హుజూర్నగర్ నియోజకవర్గ నాయకులు మాతంగి రవి, సూర్యాపేట నియోజకవర్గ నాయకులు యాతాకుల మధుసూదన్,సూర్యాపేట పట్టణ ఉపాధ్యక్షుడు తప్సి అనిల్,అసోసియేషన్ సభ్యులు వల్దాసు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love