పరకాలలో రాత్రి 11 దాటినా బార్లా తెరిచే మద్యం దుకాణాలు
హోటళ్లన్నీ ‘మద్యం’ మయమే..
పలు ప్రాంతాల్లో 24/7 బెల్ట్ దందా!
నవతెలంగాణ – పరకాల
నిబంధనలు సామాన్యులకేనా? బడా మద్యం వ్యాపారులకు చట్టం వర్తించదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది పరకాల పట్టణంలో. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్ షాపులు నిర్ణీత సమయానికి షట్టర్లు పడాలి.. కానీ పరకాల పట్టణంలో మాత్రం రాత్రి 11 గంటలు దాటినా ప్రధాన షట్టర్లు తీసి మరీ విక్రయాలు సాగిస్తుండటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
హోటలా..? బారా..?
పరకాల పట్టణంలోని పరిస్థితి చూస్తుంటే హోటళ్లకు, బార్లకు తేడా లేకుండా పోయింది. పట్టణంలోని దాదాపు ప్రతి హోటల్ ఒక మినీ బారును తలపిస్తోంది. టిఫిన్, భోజనం సంగతి దేవుడెరుగు కానీ, మద్యం సేవించే వారికి మాత్రం ఈ హోటళ్లు స్వర్గధామంగా మారాయి. యజమానులు కేవలం లాభాపేక్షతో నిబంధనలను తుంగలో తొక్కి హోటళ్లలోనే మద్యం తాగేందుకు అనుమతులు ఇస్తుండటంతో సామాన్య కుటుంబాలు హోటల్‌కు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
రాజిపేట, కాకతీయ టాకీస్ ఏరియాలో ’24/7′ దందా..!
ఇక బెల్ట్ షాపుల ఆగడాలకైతే అడ్డు అదుపు లేకుండా పోయింది. పట్టణంలోని రాజిపేట, కాకతీయ టాకీస్ ఏరియా, పెద్ద రాజిపేట తదితర ప్రాంతాల్లో బెల్ట్ షాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. ఇక్కడ రాత్రి పగలు అనే తేడా లేదు.. 24/7 మద్యం అందుబాటులో ఉంటోంది. వైన్ షాపులు మూసినా, ఈ ప్రాంతాల్లోని బెల్ట్ షాపుల్లో మాత్రం మద్యం ఏరులై పారుతోంది. గల్లీ గల్లీలో మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున ‘మామూళ్ల’ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శాంతి భద్రతలకు విఘాతం..
అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరవడం, గల్లీల్లో 24 గంటల బెల్ట్ షాపుల దందా వల్ల పట్టణంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. మందుబాబుల వీరంగం, రోడ్లపై అసభ్య పదజాలంతో కేకలు వేయడం నిత్యకృత్యమైపోయింది. ముఖ్యంగా రాజిపేట, కాకతీయ టాకీస్ పరిసర ప్రాంతాల్లో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు..
ఇంత బహిరంగంగా ప్రధాన షట్టర్ల నుండే విక్రయాలు సాగుతున్నా, హోటళ్లు బార్లుగా మారుతున్నా, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నప్పటికి ఎక్సైజ్ పోలీసులు, స్థానిక యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పరకాలలో ఈ మద్యం మాఫియాకు అడ్డుకట్ట వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.



