సర్పంచుల పాలనా.? ప్రత్యేక పాలనా.?

– రేపటితో ముగియనున్న జెడ్పీ, మండల అధ్యక్షుల పదవి కాలం
– రుణమాఫీ పూర్తి చేశాకనే అంటూ ప్రచారం
– ఇప్పటికే గ్రామాల్లో ప్రత్యేక పాలన
నవతెలంగాణ – తాడ్వాయి 
జెడ్పీ, మండల అధ్యక్ష పదవీకాలం రేపటితో ముగియనుంది. వాటికి ఇప్పట్లో ఎన్నికలు జరపడం సాద్యంకాదు. ఎందుకంటే ముందుగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే సర్పంచ్ ల పదవీకాలం ముగియడంతో గ్రామాల్లో నాలుగు నెలలుగా ప్రత్యేక పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జెడ్పీ, మండల అధ్యక్షుల పదవి కాలాన్ని పోడగిస్తుందా.? లేక వాటి స్థానంలో  ప్రత్యేక అధికారులను నియమిస్తుందా.? అనేది చర్చనీయంగా మారింది.
ఒక్క రోజుల్లోనే..
మండలంలో మొత్తం 18 గ్రామపంచాయతీలు ఉండగా, సర్పంచ్ ల పదవీకాలం గత ఫిబ్రవరి 2న ముగియడంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. అలాగే జులై 3న మండల పరిషత్ అధ్యక్షుల పదవికాలం, జులై 4న జిల్లా పరిషత్ సభ్యుల పదవీకాలం ముగియనుంది. అయితే ప్రభుత్వం ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2లక్షల రైతు ఋణాలు మాఫీ చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 15 నాటికి రుణాలు మాఫిచేసి, అక్టోబర్ లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం సాగుతోంది. ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో పంచాయతీ ప్రాదేశిక రిజర్వేషన్లు  పదేళ్లు వర్తించేలా అప్పట్లో చట్టం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రద్దు చేసి కొత్తగా తమకు అనుకూలంగా రిజర్వేషన్లు రూపొందిస్తుందా.? లేక గత ప్రభుత్వం ఆనాడు చేసిన విధంగానే కొనసాగిస్తోందా.? అనేది వేచి చూడాల్సిందే.
కొనసాగిస్తారనే ఆశ..
మరో ఒక్కరోజుతో ముగియనున్న  జెడ్పీ, మండల అధ్యక్ష పదవీకాలాన్ని మరికొన్ని నెలలపాటు పొదగించే అవకాశం ఉందని పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఆశ పడుతున్నారు. కానీ గతంలో సర్పంచ్ ల పదవీకాలం ముగియగానే ప్రభుత్వం వెంటనే ప్రత్యేక అధికారులను నియమించింది. రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు వీరికి కూడా అదేవిధమైన అవకాశాలు ఇస్తుందా.? లేక మరికొన్ని నెలలపాటు పొగిస్తుందా.?  అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీరికి పదవీకాలం పొడిగిస్తే సర్పంచ్ లుగా పని చేసిన వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Spread the love