Monday, May 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమండుతున్న ఎండలు..వీస్తున్న వడగాలులు

మండుతున్న ఎండలు..వీస్తున్న వడగాలులు

- Advertisement -

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వడగాలుల హెచ్చరిక
చాలా జిల్లాల్లో 46 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు
కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో రోహిణి కార్తె ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బయటకెళ్లితే మాడ పగిలేలా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణ ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డులకు దాదాపు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు 46 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కొమ్రం భీమ్‌ అసిఫాబాద్‌, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో పలు చోట్ల 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా 15 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైనే నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో సోమవారం కూడా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ ‌కె.నాగరత్న హెచ్చరించారు. వచ్చే మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో నమోదవుతాయని తెలిపారు. జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, కొమ్రంభీం అసిఫాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పులు వీచే సూచనలున్నాయని హెచ్చరించారు.

పలు జిల్లాల్లో వర్షం
రాష్ట్రంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పలు జిల్లాల్లో వర్షం పడింది. ముఖ్యంగా వికారాబాద్‌, నాగర్‌‌కర్నూల్‌, మహబూబ్‌‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. వికారాబాద్‌ ‌జిల్లా బషీర్‌‌బాద్‌లో అత్యధికంగా 3.8 సెంటీమీటర్ల వాన పడింది.

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
కుంచెవల్లి(కొమ్రంభీం అసిఫాబాద్) 46.5 డిగ్రీలు
సిర్పూర్‌(‌కొమ్రం భీం అసిఫాబాద్‌) 46.5 డిగ్రీలు
పెద్దపల్లి 46.5 డిగ్రీలు
సూర్యాపేట 46.5 డిగ్రీలు
దుమ్మగూడెం(భద్రాద్రి కొత్తగూడెం) 46.3 డిగ్రీలు
ధర్మపురి(జగిత్యాల) 46.3 డిగ్రీలు
మోతె(సూర్యాపేట) 46.2 డిగ్రీలు
పల్లెగూడెం(ఖమ్మం) 46.2 డిగ్రీలు
తాండూరు(మంచిర్యాల) 46.1 డిగ్రీలు
ఈసాల తక్కెళ్లపల్లి(పెద్దపల్లి) 46.1 డిగ్రీలు​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -