‘రెండో ఓటే’ లెక్క..!

Counting– పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై వీడని ఉత్కంఠ
– మ్యాజిక్‌ ఫిగర్‌ 1,55,095 ఓట్లు ఎవరికీ రాని వైనం
– ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం
– మొదటి ప్రాధాన్యత ఓట్లతో తేలని ఫలితం..!
– లెక్కింపు సరిగా లేదని బీఆర్‌ఎస్‌ అభ్యంతరం
– విధులకు ఆటంకం కలిగించారని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డిపై కేసు నమోదు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/మిర్యాలగూడ
ఉమ్మడి వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. నల్లగొండలోని కౌంటింగ్‌ కేంద్రం అనిశెట్టి దుప్పలపల్లి గోదాములో రెండో రోజు గురువారం రాత్రి వరకు లెక్కింపు కొనసాగుతుంది. పోలై చెల్లిన ఓట్లలో 50 శాతానికి ఒక ఓటు అధికంగా సాధించిన అభ్యర్థిని విన్నర్‌గా ప్రకటిస్తారు. కానీ గురువారం రాత్రి వరకు మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆ మొత్తాన్ని ఏ అభ్యర్థి సాధించలేదు. ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్యత ఓటును పరిగణలోకి తీసుకొని లెక్కింపు ప్రారంభించారు. కాగా, 4 రౌండ్లు లెక్కింపు పూర్తి కాగా కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న ఆధిక్యతతో ఉన్నారు. రెండో స్థానంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌ రెడ్డి, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి ఉండగా, నాలుగో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ కుమార్‌ ఉన్నారు. ప్రతి రౌండ్‌లో 96 వేల ఓట్లను లెక్కించారు.
తొలి ప్రాధాన్యత ఓట్లతో తేలని విజేత..
నాలుగో రౌండ్‌ పూర్తయ్యాక వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజేత తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది. కాగా, మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డాయి. మొదటి ప్రాధాన్యతలో ఏ ఒక్కరికీ గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాలేదు. దాదాపు 1,55,095 లక్షలు మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధిస్తేనే విజేతలుగా నిలిచే అవకాశం ఉన్నా ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌ రాలేదు. కాగా, గత ఎన్నికల తరహాలోనే ఈ ఎలక్షన్స్‌ ఫలితం తేలడానికి నాలుగు రోజులు పట్టొచ్చని కౌంటింగ్‌ అధికారులు చర్చించుకుంటున్నారు.
రెండో ఓటుకు పోతే లాభనష్టాలపై బేరీజు..
రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించక తప్పలేదు. ఈ నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ తమకే ఎక్కువగా లభిస్తాయని కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న విశ్వాసంతో ఉండగా.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి సైతం అంతే నమ్మకంతో ఉన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇతరులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వారు రెండో ప్రాధాన్యత తనకే వేసిఉంటారని కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న భావిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీకి తొలి ప్రాధాన్యత ఓటు వేసినవారిలో ఎక్కువ మంది రెండో ప్రాధాన్యత ఓటు బీఆర్‌ఎస్‌కే వేశారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గతంలోలాగే ఎలిమినేషన్‌ ప్రక్రియ వరకు కౌంటింగ్‌ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఫలితం శుక్రవారం లేదా శనివారం వెలువడే ఛాన్స్‌ ఉంది.
లెక్కింపు సరిగా లేదన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి
మూడవ రౌండ్‌లో లెక్కింపు సరిగా జరగలేదని 1100 ఓట్లు లెక్కించకుండానే కాంగ్రెస్‌ అభ్యర్థికి మెజార్టీ చూపించారని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేష్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక అభ్యర్థికి మేలు చేసే విధంగా కౌంటింగ్‌ అధికారులు వ్యవహరిస్తున్నారని రిటర్నింగ్‌ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆరోపించారు. నాలుగో రెండు కౌంటింగ్‌ నిలిపివేయాలని కోరారు. దీంతో నాలుగో రౌండ్‌ కౌంటింగ్‌ రాత్రి 9 గంటల వరకు ప్రారంభించలేదు. ఓటమిని జీర్ణించుకోలేకనే ఎన్నికల అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న తెలిపారు. దాంతో గురువారం సాయంత్రం కౌంటింగ్‌ కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. కౌంటింగ్‌ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి తమ విధులకు ఆటంకం కలిగించారని ఏఆర్‌ఓ వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

మొదటి రౌండ్‌లో..
మొత్తం 96,097 ఓట్లు లెక్కించగా అందులో చెల్లిన ఓట్లు 88,369, చెల్లని ఓట్లు 7728 ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 36,210, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేష్‌ రెడ్డి 28,540, బీజెపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి 11,395, ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్‌ అభ్యర్థి అశోక్‌ కుమార్‌ కు 9109 ఓట్లు లభించాయి. ఈ మొదటి రౌండులో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 7670 ఓట్లు ఆదిక్యత లభించింది.
రెండవ రౌండ్‌ లో…
రెండవ రౌండ్‌ లెక్కింపు పూర్తయ్యే సరికి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్నకు 70,785, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేష్‌ రెడ్డికి 56,114, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డికి 24,239 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్‌ అభ్యర్థి అశోక్‌ కుమార్‌కు 18,415 ఓట్లు లభించినట్టు అధికారులు ప్రకటించారు.
మూడవ రౌండ్‌లో..
మూడు రౌండ్లు పూర్తయ్యే వరకు కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 1,06,234 ఓట్లు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌ రెడ్డికి 87,356 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డికి 34,516 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ కుమార్‌కు 27,493 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 2,88,000 ఓట్లు చెల్లుబాటు కాగా 23,784 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదు.
నాలుగో రౌండ్‌లో..
నాలుగో రౌండ్‌ ముగిసే సమయానికి కాంగ్రెస్‌కు 1,22,813 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 1,04,248, బీజేపీకి 43,313, స్వతంత్ర అభ్యర్థికి 29,697 ఓట్లు వచ్చాయి. కాగా, నాలుగు రౌండ్లు పూర్తయినా.. గెలుపునకు కావాల్సిన కోటా ఓట్లు 1,55,095 ఎవరికీ రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కంపును చేపట్టారు.

చెల్లని ఓట్లతో అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌
– మూడు రౌండ్లలోనే 23 వేలకు పైగా చెల్లని ఓట్లు
– బ్యాలెట్‌ పేపర్లపై చిత్ర విచిత్ర రాతలు
ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో భారీగా చెల్లని ఓట్లు బయటపడుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొనగా.. మరోవైపు ఉన్నతంగా ఉండాల్సిన పట్టభద్రులు బ్యాలెట్‌ పేపర్లపై రాసిన చిత్ర విచిత్ర రాతలు విస్తుపోయేలా ఉన్నాయి. మూడు రౌండ్లలోనే చెల్లని ఓట్లు 23వేలకు పైగా నమోదయ్యాయి. ఇక బ్యాలెట్‌ పేపర్‌పై జై మల్లన్న, జై రాకేష్‌ రెడ్డి అంటూ కొందరు రాయగా, అభ్యర్థిని ప్రశంసిస్తూ కొందరు, ఆప్షన్‌ అంకె వేయకుండా కొందరు.. ఐ లవ్‌ యూ అంటూ మరికొందరు రాశారు. మరికొంత మంది పట్టభద్రులు ఫోన్‌ పే నెంబర్‌ వేశారు. మరికొందరు ఖాళీ బ్యాలెట్‌ పేపర్‌ కూడా వేశారు. ఇలాంటివన్నీ చెల్లని ఓట్లుగా పోతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో పట్టభద్రుల అతి, అవగాహన లోపం.. బాధ్యతారాహిత్యం బయటపడింది.

Spread the love