ఉప్పెనై ఉద్యమించిన పాట

ఉప్పెనై ఉద్యమించిన పాటఅన్యాయం కళ్ళముందు కనబడితే కాలరాయాలనిపిస్తుంది. సవాలు విసిరి ఎదురుపడితే సింహమై పంజా విసరాలనిపిస్తుంది. అధర్మానికి ఎదురొడ్డి విచ్చుకత్తిలా విరుచుకుపడాలనిపిస్తుంది. ఇది ధర్మాగ్రహంతో నిజాయితీపరుడు చేసే పని.. చేయాల్సిన పని కూడా. అలా అవినీతిని చీల్చి చెండాడే నిజాయితీపరుని మహోగ్రజ్వాలలను ఈ పాటలో చూడవచ్చు. 2023 లో విజరు కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ‘ఉగ్రం’ సినిమాలో చైతన్యప్రసాద్‌ రాసిన ఆ పాటనిపుడు చూద్దాం.

చైతన్యప్రసాద్‌ భాషావేశమున్న కవి. భావావేశమూ ఉన్న కవి. ఎలాంటి సందర్భానికైనా అవలీలగా పాట రాయగల సమర్థుడు. అతనికున్న గేయకవితాపటిమ అనన్య సామాన్యం. అద్భుతమైన పదబంధాలతో, గేయాల పాయలతో అలలు అలలుగా అడుగులెత్తగల ప్రతిభావంతుడు. భావసముజ్జ్వలప్రదీప్తి.
మన తెలుగు సినిమాల్లో సంస్కృత సుదీర్ఘ సమాసాలతో వచ్చిన పాటలు చాలా తక్కువ. అది ఆయా సినిమాల్లో సందర్భాన్ని బట్టి రాయించుకునేవారు. ఆ పాటల్ని కూడా డా.సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటి సినీగేయరచయితలు ఎక్కువగా రాసినట్లు తెలుస్తోంది. వారి తరువాత వరుసలో చైతన్యప్రసాద్‌ కూడా కనబడతారు. సంస్కృత పదబంధాలను, సమాసాలను ట్యూన్‌కి ఒదిగేంత వినమ్రంగా వేయడంలో చైతన్యప్రసాద్‌ దిట్ట. ‘ఉగ్రం’ సినిమాలో ఆయన రాసిన ఈ పాట అందుకు చక్కని ఉదాహరణ. ఆ పాటను పరిశీలిద్దాం.
హీరో నిజాయితీపరుడైన పోలీస్‌ ఆఫీసర్‌. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోడు. తన కన్నా, తన కుటుంబం కన్నా సమాజానికే ఎక్కువ విలువనిచ్చే వ్యక్తి. అలాంటి హీరో భార్యను, కూతురుని కిడ్నాప్‌ చేసి బంధిస్తారు కొందరు అవినీతిపరులు. వారున్న జాడను తెలుసుకుని అక్కడికి వెళ్ళి తన భార్యాబిడ్డల్ని కాపాడుకుంటాడు. అంతే కాదు.. అక్కడ బంధించబడ్డ ఎంతోమంది అమాయకుల ప్రాణాలూ కాపాడతాడు. చాలాకాలంగా పోలీస్‌ స్టేషన్‌ లలో మిస్టరీగా ఉన్న కిడ్నాప్‌ కేసులన్ని క్లియర్‌ చేస్తాడు. అలా అతడు అవినీతిపరులతో పోరాడుతున్న సమయంలో గాయపడతాడు. మృత్యువు అంచులదాకా వెళతాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటాడు. అయినా నిజాయితీనే ధైర్యంగా చేసుకుని, ఆవేశాన్నే బలంగా చేసుకుని శత్రుమూకపై విరుచుకుపడతాడు. ఆ సమయంలో అతనిలో కాలరుద్రుడు ప్రవేశించాడా? అన్న సందేహం రాకమానదు. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది.
అది భయంకర రూపం.. ఆవేశం నిండిన రూపం.. శివుని మూడో కన్ను అది.. ఆ భయంకర రూపం మృత్యువై తీక్షణంగా చూస్తున్నది.. అలాంటి రూపంతో హీరో అరాచకాలు, అకత్యాలు చేసే దుష్టులపై వీరావేశంతో విరుచుకుపడుతుంటాడు. వారిని చీల్చి చెండాడుతుంటాడు. మృత్యువులా వారిపై పడతాడు. శివుడు తాండవమాడుతూ మహోజ్జ్వలంగా ప్రకాశిస్తున్న తీరులో హీరో కనబడుతున్నాడు. ఆ శివతాండవాన్ని చూడగల సాహసం చేయలేం. అంత కోపోద్రిక్తుడై ఉన్నాడు హీరో.
శత్రువుల ప్రాణాలను హరించే శివాస్త్రమై విజంభిస్తున్నాడు హీరో. మహోజ్జ్వలంగా భాసించే త్రిశూలమై ఊగిపోతూ వాళ్ళ గుండెలు చీలుస్తున్నాడు. కుత్తుకలు కోసేస్తున్నాడు. విరామమెరుగక అతడు చేసే భయంకర సమరం అందరినీ భయకంపితులను చేస్తోంది. ఎన్నో ఏళ్ళుగా అమాయకులపై జరుగుతున్న దమనకాండకు చరమగీతి పాడుతున్నాడు హీరో..
ఇది శివుని గర్జన.. ముల్లోకాలు కంపించే అరివీరభయంకర గర్జన.. దుర్మతులను, దుర్మార్గులను ముక్కలు ముక్కలుగా తెగనరికే మహాబలమున్న తేజం.. బాగా రగిలి రగిలి సెగలు గక్కుతున్న పరమశివుని (శివునికి ‘ఖండపరశు’ అనే పేరు కూడా ఉంది. బదరికాశ్రమంలో నరనారాయణులు సంచరించే క్రమంలో నరుడు వదిలిన బాణం గొడ్డలిగా మారి శివుని చేతిలోకి చేరుతుంది.. పరాశు అంటే గొడ్డలి.. అప్పటి నుంచి శివునికి ఖండపరశు అనే పేరు వచ్చినట్టుగా చెబుతారు) ప్రతాపమిది. కోపం అనే అగ్నితో మండుతున్న యాగమది. ప్రమథులకు నాథుడైన పరమశివుని నాట్యమది. దిద్దిమి ధిమి అంటూ దిక్కుల చివరదాకా వినిపించే, కనిపించే, ప్రసరించే శివతాండవమది. ఇక చెడుని సంహరించడానికి యుద్ధమే సరైన మార్గమని, అదే మహోత్తమమని నమ్మిన హీరో ఆవేశం ఇక్కడ కనబడుతుంది. బీభత్సంగా సాగే గొప్ప యుద్ధమనే ఉత్సవమిది… అవినీతిని మట్టుపెడుతూ, నీతికి మంగళగీతిక పాడే గొప్ప పండుగ ఇది అంటూ ఉద్యమగీతికి అనలరీతి రచించాడు చైతన్యప్రసాద్‌.
ఈ పాట మొత్తాన్ని గమనిస్తే హీరోలో ఉన్న ఉద్రేకాన్ని, ఆవేశాన్ని శివతేజంతో పోల్చి చెప్పాడు చైతన్యప్రసాద్‌.. ‘వికల మతుల వికట గతుల’, ‘దుర్నిరీక్ష్యక్షేత్రం’, ‘ఖండపరశు ప్రచండ ప్రతాపం’, ‘రుద్రఫాలనేత్రం’ ‘ఆగ్రహాగ్నిహోత్రం’ వంటి సమాసాలన్నీ చైతన్యప్రసాద్‌ కున్న సంస్కృతభాషాధురీణతను తెలియజేస్తాయి. శ్రీచరణ్‌ పాకాల సంగీతం, గానం కూడా అద్భుతంగా ఉన్నాయి. హీరో అల్లరి నరేశ్‌, హీరోయిన్‌ మిర్నా మీనన్‌ ల నటన కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పాట:

ఉగ్రం ఉగ్రం రుద్రఫాలనేత్రం/ ఉగ్రం ఉగ్రం మృత్యుతీక్షవీక్షణం/ నిటాలాక్షు నటత్‌ తటిత్‌ దుర్నిరీక్ష్యక్షేత్రం/ హరహరహర శత్రుప్రకర ప్రాణహర శివాస్త్రం/ ఉగ్రం ఉగ్రం ఘన త్రిశూల వేత్రం/ ఉగ్రం ఉగ్రం కాలకంఠు గర్జనం/ వికల మతుల వికట గతుల విచ్ఛిన్నక్షాత్రం/ తీండ్రించిన ఖండపరశు ప్రచండ ప్రతాపం/ ఉగ్రం ఉగ్రం ఆగ్రహాగ్నిహోత్రం/ ఉగ్రం ఉగ్రం ప్రమథనాథనర్తనం/ దిద్ధిమి ధిమి దిగ్దిగంత జంభిత శివతాండవం/ ఉగ్రం ఉగ్రం ఆగ్రహాగ్ని హోత్రం/ ఉగ్రం ఉగ్రం ప్రమథనాథనర్తనం/ ఉగ్రం ఉగ్రం యుద్ధమే మహోత్తమం/ ఉగ్రం ఉగ్రం బీభత్స మహోత్సవం.
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
[email protected]
సినీ గేయరచయిత, 6309873682

Spread the love