నేటికీ కొనసాగుతోంది శ్రీశ్రీ స్ఫూర్తి..

నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీశ్రీ అందించిన స్ఫూర్తి నేటికీ కొనసాగుతోందని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఆనందాచారి అన్నారు. శనివారం మహాకవి శ్రీశ్రీ 41వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో కవులు, రచయితలు ట్యాంక్ బండ్ పై గల శ్రీశ్రీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు పూర్వ ప్రధానాచార్యులు మోతుకూరు నరహరి తొలుత శ్రీ శ్రీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక, కర్షక పక్షం వహించిన తొలి కవి శ్రీశ్రీ అని తెలిపారు. పిల్లల కోసం శైశవగీతిని రాశారని చెప్పారు.‌ సభకు అధ్యక్షత వహించిన కె.ఆనందాచారి మాట్లాడుతూ శ్రీశ్రీ మరణించి నలభై ఏండ్లు గడుస్తున్నా ఆయన చూపిన కవితా మార్గం చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. ఆ దిశగా సాహిత్యకారులు అడుగులు వేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి, అనంతోజు మోహన్ కృష్ణ, సహాయ కార్యదర్శి సలీమ, నాయకులు మహేష్ దుర్గే, ముజాహిద్, రాజయ్య గౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love