నాదర్‌గుల్ కథలు
బాలల కథలు
పేజీలు : 104, వెల : 200/-
ప్రతులకు : నాగర్‌గుల్
సెల్ : 92475 64699
సీనియర్ బాల సాహితీ వేత్త పైడిమర్రి రామకష్ణ కలం నుండి వెలువడిన మరో కథల సంపుటి ‘నాదర్ గుల్’ కథలు ఆద్యంతం చదివింపచేస్తాయి. శీర్షిక చదవగానే ‘పుస్తకం పేరు ఇలా ఉందేంటబ్బా!’ అనిపిస్తుంది ఎవరికైనా!? రచయిత ముందుమాట చదివిన తర్వాత తమ ప్రాంతం పేరు పెట్టాడని తెలుస్తుంది. దాంతో పాటు తమ ఊరి పట్ల అతని మమకారాన్ని తెలియజేస్తుంది.
ఇక కథల విషయానికి వస్తె ‘సాంబడి ఆస్తులు’ నుండి ‘జమీందార్ కోపం’ వరకు మొత్తం 32 కథలతో ప్రతీ కథ నిజ జీవిత సంఘటనలు గుర్తు చేస్తూ మనకి దగ్గరగా అనిపిస్తాయి.
కొన్ని నీతిని బోధిస్తే, మరికొన్ని కథలు హాస్యాన్ని చిలికించాయి. ‘పిరికివాళ్ళ ప్రయాణం’ కథ అలాంటిదే.
‘పక్షుల దీవెనలు’ కథలో పర్యావరణం పట్ల తమ ప్రేమను తెలియజేసి సామాజిక స్పహను చాటుకున్నారు పైడిమర్రి.
‘జాలరికానుక’ కథలో ఊరికి చెరువు అవసరం ఎంత ముఖ్యమో తెలియజేసారు. అలాగే ‘మాకుల వైద్యం’ కథలో ఊరిలో ఉండే కులవత్తుల ఔన్నత్యాన్ని చాటి చెప్పారు.
వంట చేసేవారు మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా వంటచేస్తే, దానికి రుచితోపాటు ఆ వంట తిన్నవారి మనస్సులు కూడా
సంతోషంగా వుంటాయి. లేకుంటే భుజించిన వారి మవస్సు కోపతాపాలకు నిలయమవుతుందని తెరిపేకథ ‘ జమీందారు కోపం’ కథ చెపుతుంది. ఇలా ప్రతీ కథలో ఊరి పేరు ‘నాదర్ గుల్’ అని ఉండటమే ఈ కథల విశేషం.
ప్రముఖ సీనియర్ రచయిత ఎన్.వి.ఆర్. సత్యనారాయణమూర్త ‘బాలసాహిత్య తపస్వి పైడిమర్రి’ శీర్షికతో అభినందనలు అందించారు.
మొత్తానికి నాదర్‌గుల్ కథలు పిల్లలే కాకుండా పెద్దలూ చదవాల్సిన పుస్తకం. అందమైన ముఖచిత్రంతో వెలువడిన ఈ పుస్తకం ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఉండదగినది. ఈ గ్రంథానికి చిత్రకారుడు జయశేఖర్ అందమైన ముఖచిత్రం అందించారు. లోపల ప్రతి కథకూ ఆకర్షణీయంగా బొమ్మలున్నాయి.
– వడ్డేపల్లి వెంకటేశ్, 99895 96554