నాటకంగా హిమబిందు

Himabindu240 పేజీల అడవి బాపిరాజు చారిత్రక నవల ‘హిమబిందు’ ను నాటకంగా రాయడం సాహసమే. 14 రంగాలుగా, ముగ్గురు స్త్రీ పాత్రలతో సహా మొత్తం 13 ప్రధాన పాత్రలు గల నాటకంగా మలిచారు కె.శాంతారావు. ప్రదర్శనా యోగ్యత ఉట్టిపడింది. సంఘటనలు, సంభాషణల పదును, సంఘర్షణల రసోత్పత్తి, పతాక సన్నివేశంలో బౌద్ధాన్ని మానవ ధర్మంగా చూపిన తీరు నాటకంగా రక్తికట్టింది. త్రికాలాలలో మానవ జీవితం ఎప్పుడూ నవరసభరితమే. ఆయా స్థల కాలాదుల జీవన ప్రతిబింబమై జాతిని జాగృతపరిచే గొప్ప సాధనం నాటకం అని త్రికరణ శుద్ధిగా నమ్మే శాంతారావు విశేష అనుభవం నాటక రచనలో కనిపిస్తుంది. తొలి తెలుగు సార్వభౌములు శాతవాహనులు క్రీ.పూ.220 నుండి క్రీ.శ. 218 వరకు భారత భూభాగాన్ని పాలించిన పాలకులు. పురాణాల్లో సైతం మతాధికారులే పాలకుల్ని శాసించిన విషయం మనకు తెలుసు. శాతవాహనులను బౌద్దం నుండి తిరిగి హిందూ మతాధీనంలోకి మరల్చేందుకు స్థాలతిష్యరుషి కంకణ బద్దుడౌతాడు. ఆ దుష్ట పన్నాగంలో కడకు తన మనుమరాలినే విషకన్యగా మారుస్తాడు. ఆ కుట్రలను భగం చేయడమే నాటక ఇతి వృత్తం. వర్తక సార్వభౌముడు చారుగుప్తుడు తన కుమార్తె హిమబిందును శ్రీ కృష్ణ శాతవాహునికిచ్చి వివాహం చేయాలని తలపోస్తాడు. కానీ హిమబిందు – శిల్పి సువర్ణశ్రీ ఒకర్ని ఒకరు ప్రేమించుకుంటారు. అలాగే చారుగుప్తుని మేనల్లుడు సమదర్శి సువర్ణశ్రీ చెల్లెలు నాగబంధునికలు దగ్గరవుతారు. నాటకం చిత్ర విచిత్ర మలుపులతో అడుగడుగునా ఉత్కంఠను కలిగిస్తుంది. సుదీర్ఘకాలం ఆంధ్ర ప్రజానాట్యమండలి కార్యదర్శిగా, కార్యకర్తగా పనిచేసిన శాంతారావు ఈ నాటకాన్ని తన గురువుగా భావించే ఆంధ్ర ప్రజానాట్యమండలి పూర్వ అధ్యక్షులు ఎ.పి.విఠల్‌కు అంకితమివ్వడం సముచితం. ఆకాశవాణి పూర్వ సంచాలకులు నాగసూరి వేణుగోపాల్‌ విలువైన ముందుమాట రాశారు. పుస్తకంలో బాపిరాజు సాహితీ జీవిత విశేషాలతో పాటు నవలను నాటకంగా మలచిన తీరును కూడా రచయిత తెలపడం ముదావహం.
– తంగిరాల చక్రవర్తి, 9393804472

Spread the love