ఆరోగ్యం రుచి

The taste of healthమునక్కాయలే కాదు మునగాకులోనూ ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉన్నాయి. మునగాకును మన ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇందులో మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కాల్షియం, పొటాషియం, ఐరన్‌ ఇందులో అధికం. అంతేకాదు మలేరియా, టైఫాయిడ్‌ వంటి జ్వరాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు.. కొలెస్ట్రాల్‌, షుగర్‌ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారు మునగాకుతో చేసిన ఆహారాన్ని ప్రతిరోజూ తింటే అవి అదుపులో ఉంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఆకుతో చేసే కొన్ని రకాల రెసిపీలు మీ కోసం…
పప్పు
కావలసిన పదార్థాలు : పెసరపప్పు – ఒక కప్పు, ఉల్లిపాయ – ఒకటి, పచ్చిమిర్చి – నాలుగు, టమాటా – ఒకటి, పసుపు – చిటికెడు, పచ్చి శనగపప్పు- మూడు స్పూన్లు, కాబూలీ శనగలు – పావు కప్పు, నూనె – తగినంత, పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు, వెల్లుల్లి – ఐదు రెబ్బలు, ఎండుమిర్చి – మూడు, జీలకర్ర – ఒక స్పూను, నూనె – తగినంత, మునగాక – 100 గ్రాములు, కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం : పెసరపప్పు, శనగపప్పు, కాబూలీ శనగలు అన్నిటిని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి. అందులోనే తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, పసుపు వేసి ఉడికించుకోవాలి. కనీసం మూడు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగిపెట్టుకున్న మునగాకు వేయాలి. అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఉడికించుకున్న పప్పును వేపుకున్న మునగాకులో వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమును వేసి బాగా కలపాలి. అవసరం అయితే పావు గ్లాసు నీళ్లు వేసి మూత పెట్టాలి. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్‌ కట్టేయాలి. అంతే మునగాకు పప్పు రెడీ అయినట్‌. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
పచ్చడి
కావలసిన పదార్థాలు : మునగాకు – ఒక కప్పు, కొత్తిమీర తరుగు – అర కప్పు, నువ్వులు – నాలుగు స్పూన్లు, చింతపండు – నిమ్మకాయ సైజు, ఎండుమిర్చి – పది, నూనె – 8 నుంచి 10 స్పూన్లు, వెల్లుల్లి – ఆరు రెమ్మలు.
తయారీ విధానం : మునగాకును, కొత్తిమీరను శుభ్రంగా కడిగి పక్కన ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక మునగాకును వేసి వేయించాలి. అవి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో శనగపప్పు వేసి వేయించాలి. అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసి వేయించాలి. చివరిలో నువ్వులను వేయాలి. వీటన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర తరుగును కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించిన అన్నింటిని వేసి, చింత పండును వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ మొత్తం మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్‌ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించి ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి చేయడం చాలా ఈజీ. రుచికి రుచి.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
చపాతీ
కావలసిన పదార్థాలు : గోధుమపిండి – ఒకటిన్నర కప్పు, మునగాకులు – ముప్పావు కప్పు, కొత్తిమీర తరుగు – అర కప్పు, అల్లం తరుగు – అర స్పూను, పచ్చిమిర్చి – నాలుగు, ఉల్లిపాయ – ఒకటి, జీలకర్ర – కొద్దిగా, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం : ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని అందులోనే సన్నగా తరిగిన మునగాకులు, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేసి బాగా కలపాలి. అందులోనే జీలకర్ర పొడి, చాట్‌ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. నీరు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ పిండిని గాలి తగలకుండా మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు చిన్న బాగాన్ని తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. స్టవ్‌ మీద పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కాక ఈ చపాతీని దానిపై వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. దీన్ని ఏ కూరతో తిన్నా టేస్టీగా ఉంటుంది. రుచి కూడా అదిరిపోతుంది.
లడ్డు…
కావలసిన పదార్థాలు : మునగాకు పొడి – రెండు కప్పులు, కొబ్బరి తురుము – ఒక కప్పు, సన్‌ ఫ్లవర్‌ సీడ్స్‌ – అరకప్పు, ఖర్జురాలు – స్వీట్‌కు సరిపడా, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌, ఎండుద్రాక్ష గార్నిష్‌కు సరిపడా.
తయారీ విధానం : స్టవ్‌ మీద కళాయి పెట్టి వేడెక్కాక.. అందులో తురిమిన కొబ్బరిని వేసి కాస్త బంగారు రంగులోకి మారేవరకు వేయించుకోవాలి. దాన్ని పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు అందులో పొద్దుతిరుగుడు గింజలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌, ఎండుద్రాక్ష, వేసి వేయించుకోవాలి. వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అందులోనే ఖర్జూరాలను కూడా వేసి పొడి చేసుకోవాలి. అలాగే బ్లెండర్లో ఖర్జూరాలను కూడా వేసి పొడి చేయండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మునగాకుల పొడిని వేయండి. అలాగే వేయించిన కొబ్బరి తురుము, నట్స్‌, ఖర్జూరం కలిపిన పేస్టు, తేనె, వేయించుకున్న పొద్దుతిరుగుడు గింజలు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. కాస్త నెయ్యిని వేసి చేతులకు కూడా నెయ్యి రాసుకోండి. ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకొని గాలిచొరబడని డబ్బాలో వేసుకోవాలి. వీటిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
సూప్‌
కావలసిన పదార్థాలు: మునగాకు – ఒకటిన్నర కప్పు, చిన్న ఉల్లిపాయలు – నాలుగు, టమాటా – ఒకటి,
జీలకర్ర – అర టీ స్పూను, వెల్లుల్లిరెమ్మలు – అయిదు, నీళ్లు – రెండు కప్పులు, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తాలింపుకు రెండు స్పూను.
తయారీ విధానం : మునగాకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. తర్వాత స్టౌ పై బాండి పెట్టుకుని నూనె వేసి.. వేడి చేయాలి.. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి కొద్దిగా వేయించాలి. అందులో వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి వేసుకోవాలి. తరువాత కొంత సేపు వేయించి అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు వేసుకుని వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చిన్నగా తరిగిన టమాటా ముక్కలను వేయాలి. టమాటా బాగా వేగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న మునగాకులను వేసుకుని కొంత సేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో నీరు పోసుకోవాలి. 10 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. దింపే ముందు కొద్దిగా మిరియాల పొడి చల్లుకుని స్టౌ మీద నుంచి దింపేస్తే.. మునగాకు సూప్‌ రెడీ.. వేడి వేడిగా తాగితే.. రుచి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.

Spread the love