మూఢనమ్మకాలను ఛేదించే మంత్రదండం

A magic wand that breaks superstitionsనేటి బాలలే రేపటి పౌరులు… ఆధునిక భవిష్యత్‌ పౌర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలి. తల్లిదండ్రులు, గురువులు, బాల సాహితీవేత్తలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు తమ వంతు కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలి. కథలు కవిత్వం సాహిత్యంలోని వివిధ ప్రక్రియల ద్వారా పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాలి. చిన్న వయసులోనే పిల్లల్లో దిద్దుబాటు జరిగితే అది భావి జీవితానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఆ భారం బాధ్యత ఎక్కువగా మోయాల్సింది బాల సాహితీవేత్తలే. ఇలా ఎందుకు అంటున్నానంటే ఇంకా తల్లిదండ్రులలో నిరక్షరాస్యులు ఎక్కువే! అక్షరాస్యులైన తల్లిదండ్రులలో తీరిక ఉన్నవారు బహు తక్కువ. వీరంతా తమ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని మంచి చెడులు నేర్పడం అంటే అంత తేలిక కాదు.
ఇకపోతే మనకు మిగిలిన మార్గదర్శకులు గురువులే! అయితే వీరు సిలబస్‌ను అనుసరించి బోధించవలసి ఉంటుంది. పూర్తి స్వేచ్ఛ వీరికి ఉండదు. పరీక్షలు మార్కులు, ర్యాంకుల కోసం, చదవడం అలవాటైన విద్యార్థులు సైతం సిలబస్‌లోని విషయపరిజ్ఞానాన్ని తేలికగా వదిలేస్తున్నారు. అలా కాకుండా నేటి బాలబాలికలు భావి జీవితంలో మంచి పౌరులుగా ఎదగడానికి ఎలాంటి భావజాలం అవసరమనేది ఉపాధ్యాయులుగా స్థిరపడిన సాహితీవేత్తలు. గుర్తించగలిగే అవకాశాలు వారికి మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయురాలిగా ఉత్తమ సేవలు అందిస్తూ, విద్యార్థులను సజనాత్మకంగా అభివద్ధిలోకి తీసుకురావాలనే సదుద్దేశంతో డాక్టర్‌ ఉప్పల పద్మ తన విద్యార్థుల చేత కథలు రాయించారు. తానే, సంపాదకులుగా ‘మంత్రదండం’ అనే కథల పుస్తకం తీసుకువచ్చారు. గుండ్రాంపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, విద్యార్థినీ విద్యార్థులు రాసిన కథలివి. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడంతో, పల్లె ప్రజల్లో పాతుకుపోయిన మూఢనమ్మకాలను, పిల్లల్లో నాటుకుపోయిన అపనమ్మకాలను, తొలగించడానికి వివిధ ఇతివత్తాలను విద్యార్థులకు ఇచ్చి కథలు రాయించారు. ఇందులో మొత్తం 19 కథలు ఉన్నాయి. పదునెనిమిది కథలు విద్యార్థులు రాయగా చివరి కథను సంపాదకులు రాశారు.
సాధారణంగా బాలల కథా సాహిత్యాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. పెద్దలు పిల్లల కోసం రాసే కథలు ఒక రకం కాగా, పిల్లలు రాసే కథలు మరోరకం మంత్రదండం కథా సంపుటిలోని కథలు రెండో రకం కథలు. పిల్లల్లో శాస్త్రీయ దక్పథాన్ని తీసుకురావాలనే సత్సంకల్పంతో సంపాదకులు చేసిన ప్రయత్నం సీరియస్‌ గానే కనిపించింది. ‘సైన్స్‌లోని మ్యాజిక్కును ఆలంబనగా చేసుకుని (సున్నపు నీళ్లలో పసుపు కలవడం ద్వారా ఎరుపు ఎక్కటం) ఒక మంత్రగాడు రామాపురం గ్రామ ప్రజలను మోసం చేయబోగా అదే ఊరిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి అడ్డుకుంటాడు. ఇది బయటపడ్డం నిజం కథలోని సారాంశం. 9వ తరగతి చదువుతున్న రిత్విక్‌ గౌడ్‌ రాసిన ఈ కథ మంత్రదండం కథా సంపుటిలో మొదటిది. చదువుకుంటే శాస్త్రీయమైన దక్పథాన్ని ఎలా పెంపొందించుకోవచ్చునో తెలియజేస్తుంది. నాలుగు తోవలు కలిసిన దారిలో తిప్పేసిన నిమ్మకాయలను తొక్కడం ద్వారా ఇద్దరు స్నేహితులు కలవరపడతారు. అందులో ఒకరికి జ్వరం రావడంతో అతడు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్తాడు. వారు స్వామీజీ దగ్గరికి వెళ్లాలని నిశ్చయించుకున్న తరుణంలో డాక్టర్‌ ఇంటికి వచ్చి మందులు ఇస్తాడు. దాంతో జ్వరం తగ్గిపోతుంది. ‘నిమ్మకాయలకు జ్వరం రాదు’ ఈ కథలోని సారాంశం. ఈ కథ ఆరవ తరగతి విద్యార్థిని జి అక్షిత రాశారు. మూడవిశ్వాసాలను విపరీతంగా నమ్మే మల్లమ్మ సంఘయ్య దంపతులు స్వామీజీ నుండి తమ కూతురిని ఎలా కాపాడుకున్నారో తెలియజేసే కథ ఉపాయం. (రచన- కే. శ్రీవల్లి పదవతరగతి)
అమావాస్య రోజు బయటకు వెళ్ళొద్దని మంత్రాలు చేసి తిప్పేసుకుంటారని పెద్దలు పిల్లలకి భయాన్ని నూరి పోస్తుంటారు. కానీ బి అక్షిత ‘భయం లేదు గియం లేదు’ కథలో ఒక ముసలమ్మ పాత్ర ద్వారా ఇవన్నీ వట్టి పిచ్చి నమ్మకాలని చెప్పిస్తుంది. చిన్ననాటి నుండే నాయనమ్మ చెప్పిన మాటలు విని మూఢనమ్మకాలని తలకెక్కించుకున్న మోక్షిత ఎలా ఉద్యోగం పోగొట్టుకుందో తెలియజేస్తుంది ‘తుమ్మా ఉద్యోగమా?’ కథ.
ఈ కథా సంపుటిలో సీమా అక్షిత రాసిన ‘బూతం లేదు గీతం లేదు’, జి రిషిక రాసిన ‘అత్త కోడళ్ళు’, బి. అలకనంద రాసిన ‘మంచి టీచర్‌’, మె హైక్‌ రాసిన ‘సాహసం’, ఖాజా రాసిన ‘తెలివైన బాలుడు మూఢనమ్మకాల నాయనమ్మ’, ఎస్‌ అక్షిత రాసిన ‘చిల్లుల సంచి’, బి. శివరాం రాసిన ‘మంత్రగాడి మోసం’, సీమ హన్సిక రాసిన ‘మంత్రగత్తె మోసం’, కె. భావన రాసిన ‘మోక్షాన్ని ఇచ్చే బండరాళ్లు’, ఎన్‌ క్షితిజ రాసిన ‘స్వామీజీ మంత్రాలు’. ఈ కథలన్నీ చదవదగినవే. ఇక ఈ కథా సంపుటిలో చివరిది సంపాదకులు డాక్టర్‌ ఉప్పల పద్మ రాసిన మంత్రదండం కథ.
ఒకవైపు దేశం, ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో ముందడుగు వేస్తున్నప్పటికీ, మరోవైపు సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబాలు మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలలో చిక్కుకొని అల్లాడిపోతున్నాయి.
ఈ మంత్రదండం కథా సంపుటిలోని కథలన్నీ ప్రజలలో విద్యార్థుల్లో, శాస్త్రీయ ఆలోచనని కలిగించడానికి చేసిన ప్రయత్నంగా చెప్పవచ్చు. పౌర్ణమి అమావాస్య, మంత్రగాళ్లు, చేతబడులు, దయ్యాలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు, పసుపు కుంకుమలు, తిప్పి వేయడాలు, నాలుగు తోవలు, మూడు తోవలు ఈ అంశాల పట్ల సమాజంలో నెలకొని ఉన్న భయాలు, ఇంకా గుడ్డి నమ్మకాలు, అమాయకమైన ప్రజలను మోసం చేసే మంత్రగాళ్ల వేషాలు, స్వామీజీలు వంటి విషయాలు మనకు కనిపిస్తాయి.
ఎవరైతే తమ పిల్లల్ని ఉత్తమ గుణాలు కలవారుగా మంచి సంస్కారం అబ్బేలా తీర్చి దిద్దుతారో అలాంటి వారే సరైన తల్లిదండ్రులు. ఏ సమాజంలోనైనా సరే పిల్లలు ధర్మంగా నడిచేలా తీర్చిదిద్దే తల్లిదండ్రులు ఆ సమాజపు అసలైన ఆస్తి. కుటుంబాలు ఫెయిలైతే సమాజం కూడా ఫెయిలవుతుంది. మంచి ప్రవర్తన అనే భవంతికి మంచి ఆలోచనలు పునాది రాళ్లు. పునాది బలంగా ఉంటే భవంతి కూడా స్థిరంగా ఉంటుంది.
– డాక్టర్‌ గన్నవరం వెంకటేశ్వర్లు, 9550384498

Spread the love