కథంతా ఈరోజే…

All the story today...– ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర
– బూత్‌ల వారీగా పంపకాలు
– తటస్థులకు గాలం
– ఓటు విలువ రూ.5 వేలు పలుకుతున్న వైనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రచారం పరిసమాప్తం కావటంతో ఇక ‘అసలు కథ’ బుధవారం రాత్రి మొదలు కానుంది. గురువారం పోలింగ్‌పై ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకుల అంచనా. బుధ, గురు వారాల్లో మద్యం దుకాణాలు బంద్‌ చేయాలంటూ ఈసీ ఆదేశించినా ‘అందాల్సిన దంతా’ ముందే అందటంతో మందు బాబులకు ఎలాంటి ఢోకా లేదు. ఇక ధన ప్రవాహం కట్టలు తెంచుకోనుంది. పార్టీలన్నీ విచ్చలవిడిగా డబ్బును పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేయగా… వాటిలో ఒక ప్రధాన పార్టీ… తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ‘ఎంత ఖర్చయినా ఫరవాలేదు, ఈసారీ గెలిచి తీరాలి…’ అనే విధంగా… ప్రతీ నియోజకవర్గంలోని తటస్థ ఓటర్లను తన బుట్టలో వేసుకునేందుకు కోటాను కోట్లను అది గుమ్మరించనుందని సమాచారం. వీలైతే రూ.2 వేలు లేదంటే రూ.5 వేల వరకైనా పంపిణీ చేయటం ద్వారా వారి ఓట్లను తన ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ వ్యూహం రచించిందని తెలుస్తోంది. మరోవైపు చీరెలు, సారెలు, కుంకుమ భరిణెలు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు షరా మామూలుగా జిల్లాలు, అక్కడి నుంచి నియోజకవర్గాలకు ఇప్పటికే తరలిపోయాయి. బుధవారం నాటికి సంబంధించిన పంపకాలకు అదనంగా ఈసారి రెండు రోజుల ముందు కూడా అవన్నీ పూర్తయ్యాయి. ముందు జాగ్రత్తగా మంగళవారం నాడే వార్డుల వారీగా నగదు, మద్యం పంపకాలు జరిగాయి. ఖమ్మంతోపాటు పలు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో సైతం ఓటుకు రూ.2వేల చొప్పున పంపిణీ చేసినట్టు వినికిడి. గ్రామాల్లో కుటుంబాలు, సంఘాల వారీగా..పట్టణాల్లో అపార్టుమెంట్లు, కాలనీల వారీగా ఈ పంపకాలు పూర్తయినట్టు సమాచారం. ఈ రకంగా ప్రచార పర్వం పరిసమాప్తం కావటంతో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాయి. వివిధ పార్టీల గెలుపోటములను ఇది కూడా తీవ్ర ప్రభావం చూపనుంది.

Spread the love