గెలుపెవరిది ?

గెలుపెవరిది ?– సంక్షేమ పథకాలపై గులాబీ ఆశ
– ఆరు గ్యారంటీలపై హస్తం ధీమా
– చేతులెత్తేసిన బీజేపీ
– రైతుబంధు ఎవరి కొంప ముంచనుంది
– అంతు పట్టని జనం నాడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఎన్నికలు యుద్ధ రంగాన్ని తలపిస్తు న్నాయి. సూటిపోటి మాటలు ఘాటైన విమర్శల నేపథ్యంలో ఉద్వేగ భరితమైన వాతావరణం నెల కొంది. తమ మ్యానిఫెస్టోలను ఏ కరువు పెడుతూనే ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేల్చుకున్నారు. షెడ్యూల్‌ ప్రకటించినప్పటినుంచి రాజకీయ పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సంక్షేమ పథకాలపై అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఆశలు పెట్టు కుంటే, ఆరు గ్యారెంటీలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై హస్తం ధీమాగా ఉంది. బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ అంటూ కొంత హడావిడి చేసిన బీజేపీ తాజాగా చేతులెత్తేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకొని హ్యాట్రిక్‌ కొట్టాలని బీఆర్‌ఎస్‌, పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్‌ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కాలికి బలపం కట్టుకుని రాష్ట్రం చుట్టి వచ్చారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోల ద్వారా ప్రచారాన్ని హౌరెత్తించారు.. ప్రత్యేక హెలి కాప్టర్లను ఏర్పాటు చేసుకుని నేతలు సుడిగాలి పర్య టనలు చేశారు. ఎన్నికల చివరి క్షణంలో రైతుబంధు రూపంలో వచ్చిన పీఠముడి ఎవరి కొంపముంచు నుందో తెలియని పరిస్థితి నెలకొంది. డబ్బు, అధికారం, కులం, తదితర అంశాలు ప్రాతిపదికగా హౌరాహౌరీగా సాగుతున్న ఎన్నికల సంగ్రామం లో ఓటర్లు ఎవరిని కనికరిస్తారో డిసెంబర్‌ 3న తేలనుంది. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) 19 స్థానాల్లో పోటీ చేస్తున్నది. బూర్జువా పార్టీలకు భిన్నంగా ప్రచారం నిర్వహించింది.
96 సభల్లో పాల్గొన్న కేసీఆర్‌
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 28 సాయంత్రం ప్రచారం ముగిసే సరికి 96 ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ప్రత్యర్థి పార్టీలకు సవాళ్లు విసురుతూ తనదైన శైలిలో ఓటర్లను ఆకర్షించారు. 60 ఏళ్లలో జరగని అభివద్ధి పదేళ్లలో చేసి చూపించామని ప్రజలకు వివరిం చారు. గత ప్రభుత్వాలకు తమ ప్రభుత్వ పాలనకు తేడా గుర్తించాలని ప్రతి సభలో కేసీఆర్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తమదైన శైలిలో ప్రచారాన్ని పరుగెత్తించారు.
అగ్ర నేతనే అండగా అన్నీ తానై నడిపిన రేవంత్‌
టీపీపీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీ లను ప్రజలకు వివరిస్తూ, పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణకు చేసిందేమిలేదని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అసంతృప్తులను బుజ్జగిస్తూ, ప్రచారంలో అభ్యర్థులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ అన్ని తానై నడిపించారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ నాలుగు సార్లు రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు, మహిళలతో రచ్చబండ మీటింగ్‌లు పెట్టి తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకున్నారు. ప్రియాంక గాంధీ సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల నుంచి కూడా కాంగ్రెస్‌ ప్రచార సభలకు మంచి స్పందన లభించినట్టు తెలుస్తోంది. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్‌, మాణిక్‌ ఠాగూర్‌ తదితర కాంగ్రెస్‌ పాలత రాష్ట్రా ముఖ్యమంత్రులు తమ వాగ్దాటితో ఓటర్లను ఆకర్షించారు. కర్ణాటక సక్సెస్‌ ఫార్ములాను తెలంగాణలో అమలు చేసేందుకు కాంగ్రెస్‌ అస్త్ర శస్త్రాలను సంధించింది.
చేతులెత్తేసిన బీజేపీ
తెలంగాణలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ నినాదాన్ని ఎత్తుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు భారీ బహిరంగ సభలతో పాటు పలు రోడ్‌ షోలు నిర్వహించారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, బండి సంజరు తదితర నేతలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అస్త్ర శస్త్రాలు సంధించారు. దక్షిణాదిలో కాంగ్రెస్‌ బలపడితే పార్లమెంట్‌ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన బీజేపీ చివరి క్షణంలో చేతులెత్తేసి బీఆర్‌ఎస్‌కు లోపాయికారిగా మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు రెండు రోజుల ముందు రైతుబంధు రూపంలో వచ్చిన చిక్కుముడి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మెడకు చుట్టుకుంది. కాంగ్రెస్‌ ఫిర్యాదు తోనే ఎన్నికల కమిషన్‌ రైతు బంధును ఆపిందని బీఆర్‌ఎస్‌ అంటే, మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలతోనే రైతుబంధు ఆగిపోయిందని కాంగ్రెస్‌ ఎదురు దాడికి దిగింది. రైతుబంధు ఆగడానికి మీరంటే మీరు కారణమని కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో రైతుబంధు ఉపద్రవం ఎవరి కొంపముంచనుందో అనే భయం రెండు పార్టీల్లో నెలకొంది. మరో 24 గంటల్లో పోలింగ్‌ల ప్రారంభం కానుండగా గెలుపు తమదంటె తమదని, సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాయి. 80 శాతం ఓటింగ్‌ దాటితే అధికార పార్టీకి నష్టమని, అంతకంటె తక్కవగా నమోదయితే కాంగ్రెస్‌కు నష్టమనే వాదన కూడా తెరపైకి వస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, పోల్‌ మేనేజ్‌ మెంట్‌ కూడా గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనం నాడి అంతుపట్టకుండా ఉంది.

Spread the love