– పెద్దకొడప్‌గల్‌కు ఇన్‌చార్జి వైద్యుడే దిక్కు
– ఏ సమయంలో ఉంటారో తెలియని దుస్థితి
– పొంచి ఉన్న సీజనల్ ముప్పు
– పేదోడికి అందని సర్కారీ వైద్యం
– ఉన్న ఒక్క ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది లేక రోగులకు ఇక్కట్లు
నవతెలంగాణ-పెద్దకొడప్‌గల్
అసలే సీజనల్ వ్యాధులు ప్రబలే కాలం. ఈ సీజన్‌లో పలు రోగాల బారిన పడిన వారితో ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఆస్పత్రిలో వైద్యులతో పాటు సిబ్బంది సరిపడా ఉండి సకాలంలో వైద్యం అందించాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా లేకపోవడంతో వైద్యం కోసం ఆశగా వచ్చిన వారికి నిరాశే ఎదురవుతుంది. మండల నలుమూలల నుంచి 20 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి వచ్చిన వారికి వైద్యులు లేక ఖాళీ కుర్చి దర్శనమిస్తుంది. పెద్దకొడప్‌గల్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి రెగ్యులర్ వైద్యాధికారి లేకపోవడంతో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. పుల్కల్ వైద్యుడికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించడంతో సదరు డాక్టర్ ఇక్కడికి ఎప్పుడు వస్తారో, వెళ్తారో తెలియని దుస్థితి నెలకొంది. ఉన్న వారు సైతం సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఆస్పత్రిపై నవతెలంగాణ కథనం..
పెద్దకొడప్‌గల్ మండల కేంద్రంలో ఉన్న పీహెచ్‌సీకి నలుమూల నుంచి రోగులు రావాలంటే 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే. అవస్థలు పడి ఇక్కడికి వచ్చినా సరైన సౌకర్యాలు లేక నాణ్యమైన వైద్యం అందడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరకొర ఇన్‌చార్జీ డాక్టర్ తప్ప పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుకి వైద్యులు లేని వైద్యశాలగా మిగిలిపోయింది.
మండల కేంద్రంలోని ప్రథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది లేక గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు సర్కారీ వైద్యం అందని ద్రాక్షగానే మారింది. పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యాధికారులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్, అటెండర్ ఉండాలి. కానీ ఇక్కడ ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. అయితే శనివారం మండలంలోని కాటేపల్లి తండాకు చెందిన పలువురు రోగులు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం నిమిత్తం వచ్చారు. ఆ సమయంలో డాక్టర్, ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం, ల్యాబ్ టెక్నీషియన్, అటెండర్ ఎవ్వరు లేకపోవడం గమనార్హం. జ్ఞానేశ్వర్ అనే స్టాఫ్ నర్స్ ఒక్కరే ఉండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 100 మంది రోగులకు వైద్య చికిత్స అందజేశారు.
సిబ్బంది లేకపోవడంతో వైద్యం కోసం మండల కేంద్రంలోని ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయించడం తప్పడం లేదని జనాలు ఆరోపిస్తున్నారు. సామాన్య ప్రజలు ప్రయివేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలంటే దాదాపు 500, 1000, వందల రూపాయలు ఖర్చుఅ వుతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సర్కారీ దవాఖానలో పూర్తి స్థాయి సిబ్బంది ఉంటే మెరుగైన వైద్యం అందుతుందని జనాలు ఆరోపణలు చేస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో రోగులు గంటల తరబడి బయటనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదవసాత్తు రోడ్డుప్రమాదం గాని విషపురుగులు కాటు వేయడంగాని జరిగుతే వైద్యం అందక ప్రాణాలు కోల్పోయె పరిస్థితి కళ్ళకు కట్టినట్లుగా కన్పిస్తుందని మండల ప్రజలు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఒక్క డాక్టర్ లేకపోవడంతో ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు భరోసా ఇచ్చేది ఎవరని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేయడం ఇదేనా అని అడుగుతున్నారు. ఖాళీల స్థానాల్లో నియామకం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైద్య సిబ్బందిని వెంటనే భర్తీ చేసి ప్రజలకు కావలసిన వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఎప్పుడు వచ్చినా వైద్యులు ఉంటలే – సైమల్ కాటేపల్లి తండా
ఎప్పుడు వచ్చినా వైద్యులు ఉండటం లేదు. గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. లేదంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేటు ఆసుపత్రిలో చూపెట్టుకునే అంత స్తోమత మాకు లేకే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నాం.
కనీసం ప్రథమ చికిత్స అందట్లే- దేవి సింగ్ కాటేపల్లి తండా
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలను బలోపితం చేస్తామని చెప్పి కనీసం ప్రధమ చికిత్స చేసేందుకు కూడా సమయానికి వైద్యులు ఉండటం లేరు. ఏదైనా గాయం తగిలి ఆసుపత్రికి వెళ్తే కనీసం కట్టు కట్టడానికి అటెండర్ కూడా ఉండటం లేదు. ఇప్పటికైనా ఈ పరిస్థితులను మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.