కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై రాజీ లేదు

On Telangana's share in Krishna waters No compromise– ఎగువ రాష్ట్రాలతో వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటాం
– న్యాయ, సాంకేతిక నిపుణులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై రాజీ ప్రసక్తే లేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల వివాదాలకు సంబంధించి అంతర్‌ రాష్ట్ర సమస్యల పురోగతిని న్యాయ నిపుణులు సీ.ఎస్‌.వైద్యనాథన్‌, వి.రవీందర్‌ రావు, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రశాంత్‌ వి పాటిల్‌తో ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్‌ -2 (కేడబ్ల్యూడీటీ), సుప్రీంకోర్టు ముందు నడుస్తున్న కేసుల స్థితిగతుల్ని న్యాయవాదులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాష్ట్ర వాటాను సాధించుకునేందుకు ఎలా వెళ్లాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2015లో ఆంధ్రప్రదేశ్‌తో కుదిరిన ఒప్పందం తాత్కాలికమేననీ, అది కేవలం ఆ ఏడాదికి సంబంధించినది మాత్రమేనని తెలిపారు. ఏక పక్షంగా కుదిరిన ఆ ఒప్పందాన్ని తెలంగాణ అంగీకరించబోదని స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో వివాదం తేలే వరకు 50:50 నిష్పత్తిని అడ్‌-హౌక్‌మెజర్‌గా సవరించాలని కేడబ్ల్యూడీటీ ముందు తమ వాదనలను బలంగా వినిపించాలని మంత్రి ఆదేశించారు. సుప్రీంకోర్టులో అవార్డు పెండింగ్‌లో ఉన్నందున ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలతో సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోనున్నట్టు పేర్కాన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న తెలంగాణ శాసనసభలో చేసిన తీర్మానం మేరకు కృష్ణా బేసిన్‌లోని ఏ ప్రాజెక్ట్‌ను ఏపీకి అప్పగించబోమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల మేరకు కృష్ణా వాటా రక్షణకు న్యాయ నిపుణులు, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

Spread the love