తెలంగాణలో ఎవరిపైనా వివక్ష ఉండదు

– జాతీయస్థాయిలో తెలుగువారి లోటు కనిపిస్తున్నది : కమ్మ గ్లోబల్‌ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణలో ఏ ప్రాంతం వారిపైనా వివక్ష ఉండబోదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ‘కమ్మ గ్లోబల్‌ సమ్మిట్‌’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులాలకతీతంగా నగరంలో నివసించే ప్రజలందరి నైపుణ్యాలను ప్రోత్సహించడంతో పాటు వారికి సమానావకాశాల ను కల్పిస్తామన్నారు.ఎన్టీఆర్‌ లైబ్రరీలో అభ్యసించిన చదువే తనను ఉన్నత స్థానంలో నిలబెట్టిందని గుర్తుచేశారు. ఆయన రాజకీయంగా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. తమకు భేషజాలు లేవనీ, తాము అన్ని కులాలను గౌరవిస్తామని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం హక్కనీ, దాన్ని నియంత్రించాలనుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో గత పాలకులు చూశారని గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో తెలుగువారు లేని లోటు కనిపిస్తోందని చెప్పారు.కుల, మతాలకతీతంగా జాతీయ స్థాయిలో రాణించే తెలుగువారిని అందరూ ప్రోత్సహించాలని సూచించారు. వివాదం లో ఉన్న ఐదెకరాల కమ్మ సంఘం భూ సమస్యను పరిష్కరించడంతో పాటు భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా మార్చటంలో కమ్మ సామా జిక వర్గం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Spread the love