ఇవేం నీచమైన ప్రశ్నలు..

These are stupid questions..– టీఎంసీ ఎంపీ మోయిత్రా ఆగ్రహం
– ఎథిక్స్‌ కమిటీ సమావేశంలో గందరగోళం
– ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘క్యాష్‌ ఫర్‌ క్వెరీ’ (ప్రశ్నకు డబ్బు) వ్యవహారంలో గురువారం మహువా మోయిత్రా పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే.. ఈ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇంకా విచారణ జరుగుతుండగానే.. మహువా మోయిత్రాతో పాటు కమిటీలో ఉన్న ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు. కమిటీ చైర్మెన్‌ వినోద్‌ కుమార్‌ సోంకార్‌ గౌరవం లేని, అనైతికమైన, గోప్యతకు సంబంధించిన ప్రశ్నలు అడిగారని మహువా, ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు. లోక్‌సభలో అదానీ గ్రూప్‌పై టీఎంసీ మహువా లంచం తీసుకుని ప్రశ్నించారని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే చేసిన ఫిర్యాదును పరిశీలించేందుకు పార్లమెంట్‌ అనెక్స్‌ భవనంలో నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో నాటకీయ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.
15 మంది సభ్యుల కమిటీలో గురువారం సమావేశానికి 11 మంది హాజరయ్యారు. బీఎస్పీ ఎంపీ దానిష్‌ అలీ, సీపీఐ(ఎం) ఎంపీ పీఆర్‌ నటరాజన్‌ సహా ఐదుగురు ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు. ఆ తరువాత కూడా సమావేశం కొనసాగింది. దర్శన్‌తో ఉన్న సంబంధాలపై కమిటీ మహువాను ప్రధానంగా అడిగినట్టు సమాచారం. దర్శన్‌, ఆయన మాజీ స్నేహితుడు న్యాయవాది దేహద్రారుతో తనకున్న సంబంధాన్ని మహువా వివరించారు. అఫిడవిట్‌లోని కొన్ని విషయాలను చైర్మెన్‌ అడగడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష సభ్యులు మహువాకు మద్దతు పలికారు.
మోయిత్రాకు వ్యక్తిగత, అనైతిక ప్రశ్నలను కమిటీ వేసిందని, దాంతో పెద్ద దుమారం చెలరేగిందని బీఎస్పీ ఎంపీ దానిష్‌ అలీ పేర్కొన్నారు. చైర్మెన్‌ అడిగిన ప్రశ్నలు అమర్యాదగా ఉన్నాయని అన్నారు. విచారణ సమయంలో కమిటీ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఎవరు ఎవరితో మాట్లాడుతారు? ఏం మాట్లాడతారు? మీరు రాత్రి ఎవరితో మాట్లాడతారు? మీరు ఎలా మాట్లాడతారు? వంటి అనైతిక ప్రశ్నలు ఒక మహిళను అడిగారని, ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా ? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలు ఆమోదయోగ్యం కాదని దానిష్‌ అలీ అన్నారు. ఒకవైపు విచారణ జరుగుతుంటే ఆ వివరాలన్నీ బయటకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. చైర్మెన్‌ ఎవరికోసమో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మహిళను వ్యక్తిగత విషయాలపై అడిగే హక్కు కమిటీకి లేదని జేడీయూ ఎంపీ గిరిధారి యాదవ్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ ముందే తయారు చేసుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం చైర్మెన్‌ ప్రశ్నలు అడిగారని విమర్శించారు.
ఇదే సమయంలో మహువా మోయిత్రా కూడా ఈ సమావేశంపై నిప్పులు చెరిగారు. అసలు ఇదేం మీటింగ్‌? కమిటీ సభ్యులు నీచమైన ప్రశ్నలు అడుగుతున్నారు. వ్యక్తిగత విషయాలపై కూడా ప్రశ్నలు వేస్తున్నారు. విచారణ సమయంలో నా కళ్లల్లో నీళ్లు వచ్చాయని అన్నారు. నా కండ్లలో నీళ్లు మీకు కనిపిస్తున్నాయా” అంటూ మీడియాతో మాట్లాడుతూ మోయిత్రా విరుచుకుపడ్డారు. అంతకుముందు కూడా.. వ్యక్తిగత ప్రశ్నలు అడిగినప్పుడు మోయిత్రా వాటికి జవాబు చెప్పేందుకు నిరాకరించినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. తన వ్యక్తిగత విషయాల్ని మీటింగ్‌లో చర్చించాల్సిన అవసరం లేదని ఆమె పదేపదే పునరుద్ఘాటించారని తెలిసింది. అయినా.. తన స్నేహితుడి వద్ద నుంచి బహుమతి లభిస్తే, ఈ విషయాన్ని ఎథిక్స్‌ కమిటీ ముందుకు ఎలా తీసుకొస్తారని మోయిత్రా ప్రశ్నించారు.
అయితే.. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేస్తున్న సమయంలో మహువా మోయిత్రా ఏమాత్రం సహకరించలేదని ఎథిక్స్‌ కమిటీ చైర్మెన్‌, బీజేపీ ఎంపీ వినోద్‌ కుమార్‌ సోంకార్‌ తెలిపారు. తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆమె తమ మీద కోపం ప్రదర్శించిందన్నారు. అన్‌పార్లమెంటరీ భాషను కూడా ఉపయోగించిందన్నారు. తాము సంధించిన ప్రశ్నలను దాటవేసేందుకు.. మోయిత్రాతో పాటు ప్రతిపక్ష ఎంపీలు తమపై నిందలు మోపుతూ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారని సోంకార్‌ చెప్పుకొచ్చారు. కమిటీ కార్యకలాపాలు గోప్యంగా ఉన్నాయని, మహువా చర్యలు ఖండనీయమని బీజేపీ ఎంపీ అనంతరం అపరాజిత సారంగి అన్నారు. చైర్మెన్‌పై మహువా అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించారని ఆరోపించారు. అటు.. ఎథిక్స్‌ కమిటీ చైర్మెన్‌ వినోద్‌ కుమార్‌ సోంకార్‌ ఓబీసీ కులానికి చెందినవారని, అందుకే వాళ్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బుల కోసం మోయిత్రా తన మనస్సాక్షిని అమ్ముకున్నారని ఆరోపించారు. అన్ని ఆధారాలు కమిటీ ముందు ఉన్నాయని, మహువాను ఏ శక్తీ కాపాడలేదని దూబే అన్నారు.

Spread the love