ప్రయివేటుకెళితే రూ.లక్ష అడిగారు…

– ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రిలో అరుదైన వ్యాధికి చికిత్స
– చెవి సమస్యకు పరిష్కారం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకట్రావు పేటకు చెందిన విద్యాసాగర్‌ (52)కు గత మూడేండ్లుగా చెవిలో ఏర్పడిన వ్యాధికి కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రిలో గురువారం శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. చెవి నుంచి నిరంతరాయంగా చీము కారుతుండటంతో పలువురు చెవి, ముక్కు, గొంతు ప్రత్యేక వైద్యుల వద్ద చికిత్స తీసుకుని, కరీంనగర్‌లో రెండు సార్లు ఆపరేషన్లు చేయించుకున్నప్పటికీ నయం కాలేదు. కొన్ని రోజులకు మూతి వంకరపోయి, అన్నం తినడం కష్టంగా మారి, కనురెప్ప కూడా మూసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌లోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చూపించగా, అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అతనికి ఎడమ చెవికి సంబంధించిన ”టింపానో జుగులార్‌ పారా గాంగ్లియోమా, గ్రేడ్‌ 4 ఫేషియల్‌ పరాలిసిస్‌” (గ్లోమస్‌ ట్యూమర్‌) ఉన్నట్టు నిర్ధారించారు. ఇది చెవిలో ఉండే రక్తనాళాల నుంచి పుట్టిన గడ్డ లాంటిది. విపరీతమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉన్నటువంటి గడ్డ ఇది. చెవి లోపలి వరకు వ్యాపించి ముఖ్యమైన భాగాలను తినేసింది. ఇంకొన్ని రోజులు ఆపరేషన్‌ చేయించుకోకుంటే అది మెదడుకు వ్యాపించి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండేది. ఆపరేషన్‌ అనంతరం పేషెంటు స్థిమితంగా ఉన్నాడు. ఉదయం 10 గంటలకు మొదలుపెట్టిన శస్త్రచికిత్స సాయంత్రం 5.20 గంటలకు ముగిసింది. ఈ ఆపరేషన్‌లో ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి నేతృత్వంలో డాక్టర్లు రవిశంకర్‌, సత్య కిరణ్‌, ఆశీష్‌, మీనా, శ్వేత మత్తు వైద్యులు ఉమా, ఉమా ప్రదీప, సదానందం, నిఖిల తదితరులు పాల్గొన్నారు. వరుసగా ఇలాంటి అరుదైన ఆపరేషన్లు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిని హాస్పిటల్‌ సూపెరింటెంట్‌ డాక్టర్‌ శంకర్‌ ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. ప్రజలు ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.

Spread the love