– ప్రత్యర్థి గడ్డపై చాలెంజర్స్ జోరు
– పంజాబ్‌పై బెంగళూర్ ఘన విజయం
– ఛేదనలో విరాట్ కోహ్లి, పడిక్కల్ మెరుపుల్
– ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025
ఐపీఎల్18లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ సొంతగడ్డపై విఫలమవుతున్నా.. ప్రత్యర్థి సొంత మైదానంలో దుమ్మురేపుతోంది. ఈడెన్, చెపాక్, వాంఖడె, జైపూర్‌లో జయభేరి మోగించిన ఆర్‌సీబీ… తాజాగా ముల్లాన్‌పూర్‌లోనూ దంచికొట్టింది. చిన్నస్వామిలో ఎదురైన పరాజయానికి పంజాబ్ కింగ్స్‌పై తీయని ప్రతీకారం తీర్చుకుంది. విరాట్ కోహ్లి (73 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (61) అర్థ సెంచరీలతో 159 పరుగుల లక్ష్యాన్ని బెంగళూర్ అలవోకగా ఛేదించింది. బెంగళూర్‌కు ఇది ఐదో విజయం కాగా.. పంజాబ్‌కు మూడో పరాజయం.
నవతెలంగాణ-ముల్లాన్‌పూర్
పంజాబ్ కింగ్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తీయని ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం చిన్నస్వామిలో స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో బెంగళూర్‌ను పంజాబ్ కింగ్స్ ఓడించగా… ఆదివారం ముల్లాన్‌పూర్‌లో స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో చాలెంజర్స్ సత్తా చాటింది. 159 పరుగుల లక్ష్యాన్ని బెంగళూర్ 18.5 ఓవర్లలో ఛేదించింది. విరాట్ కోహ్లి (73 నాటౌట్, 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (61, 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. పంజాబ్ కింగ్స్ పేసర్లు, స్పిన్నర్లు వికెట్ల వేటలో విఫలమవగా 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఘన విజయం సాధించింది. అంతకుముందు, ప్రభుసిమ్రన్ సింగ్ (33, 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (31 నాటౌట్, 33 బంతుల్లో 1 ఫోర్), మార్కో జాన్సెన్ (25 నాటౌట్, 20 బంతుల్లో 2 సిక్స్‌లు) రాణించటంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. స్పిన్నర్లు కృనాల్ పాండ్య (2/25), సుయాశ్ శర్మ (2/26) మాయ చేశారు.
కోహ్లి, పడిక్కల్ మెరువగా
టార్గెట్ 159 పరుగులు. పిచ్ బ్యాటింగ్‌కు అంతగా సహకరించటం లేదు. పిచ్ నుంచి టర్న్ లేదు, బంతి నెమ్మదిస్తూ బ్యాట్‌పైకి వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) తొలి ఓవర్లోనే నిష్క్రమించాడు. విరాట్ కోహ్లి (73 నాటౌట్), యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (61) రెండో వికెట్‌కు 108 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. పంజాబ్ కింగ్స్ పేస్, స్పిన్‌ను ఈ జోడీ సమర్థవంతంగా ఎదుర్కొంది. కోహ్లి నెమ్మదిగా ఆడగా.. పడిక్కల్ ఎదురుదాడి చేశాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 31 బంతుల్లో పడిక్కల్ అర్థ సెంచరీ సాధించగా.. విరాట్ కోహ్లి ఐదు ఫోర్ల సాయంతో 43 బంతుల్లో ఐపీఎల్‌లో 67వ ఫిఫ్టీ స్కోరు అందుకున్నాడు. వికెట్ల వేటలో శ్రేయస్ అయ్యర్ వ్యూహం ఫలించలేదు. దూకుడు పెంచే క్రమంలో పడిక్కల్ నిష్క్రమించినా.. పాటిదార్ (12), జితేశ్ శర్మ (11 నాటౌట్) తోడుగా విరాట్ కోహ్లి లాంఛనం ముగించాడు. మరో ఏడు బంతులు ఉండగానే బెంగళూర్‌కు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో చాహల్ (1/36), హర్‌ప్రీత్ (1/27) రాణించారు.
బ్యాటర్లు విఫలం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. ప్రియాన్షు ఆర్య (22, 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ప్రభుసిమ్రన్ సింగ్ (33) ఆకట్టుకున్నారు. ప్రియాన్షు మరోసారి మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేదు. పవర్‌ప్లేలోనే బంతి అందుకున్న కృనాల్ పాండ్య.. ఓపెనర్లు ఇద్దరినీ సాగనంపాడు. దీంతో పంజాబ్ కింగ్స్‌కు కష్టాలు మొదలయ్యాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) మళ్లీ నిరాశపరచగా.. నెహల్ వదేరా (5), మార్కస్ స్టోయినిస్ (1) విఫలం అయ్యారు. జోశ్ ఇంగ్లిశ్ (29, 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) సహా శశాంక్ సింగ్ (31 నాటౌట్), మార్కో జాన్సెన్ (25 నాటౌట్) రాణించటంతో పంజాబ్ కింగ్స్ 157 పరుగులైనా చేసింది. ఆఖరు ఐదు ఓవర్లలో బెంగళూర్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోశ్ హాజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్ క్రీజులో నిలిచినా.. 30 బంతుల్లో కేవలం 38 పరుగులే ఇచ్చింది. స్లాగ్ ఓవర్లలో పరుగులను ఆశించిన పంజాబ్‌కు భువీ, జోశ్ నిరాశే మిగిల్చారు. ఆరంభంలో కృనాల్ పాండ్య, మిడిల్‌లో సుయాశ్ శర్మ మాయజాలం పంజాబ్ కింగ్స్‌ను కట్టడి చేసింది.
సంక్షిప్త స్కోరు వివరాలు :
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: 157/6 (ప్రభుసిమ్రన్ సింగ్ 33, శశాంక్ సింగ్ 31, కృనాల్ పాండ్య 2/25, సుయాశ్ శర్మ 2/26)
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఇన్నింగ్స్: 159/3 (విరాట్ కోహ్లి 73 నాటౌట్, దేవదత్ పడిక్కల్ 61, అర్షదీప్ 1/26, హర్‌ప్రీత్ 1/27)
కోహ్లి నం.1: ఐపీఎల్‌లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా డెవిడ్ వార్నర్ (66) రికార్డును విరాట్ కోహ్లి (67) అధగిమించాడు. వార్నర్ 184 మ్యాచుల్లో 4 సెంచరీలు, 62 అర్థ సెంచరీలు సాధించగా.. కోహ్లి 260 మ్యాచుల్లో 8 సెంచరీలు, 59 అర్థ సెంచరీలు బాదాడు.