– ఎంఓఈ వర్గాల వెల్లడి
న్యూఢిల్లీ : 2024-25 పాఠశాల విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్త నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) పాఠ్యపుస్తకాలు 3, 6 తరగతులకు మాత్రమే ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తున్నది. విద్యా మంత్రిత్వ శాఖ (ఎంఓఈ) వర్గాల నుంచి ఈ సమాచారం అందింది. నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సీఎఫ్), నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆధారంగా 1 మరియు 2వ తరగతికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఇప్పటికే విడుదలయ్యాయి. పుస్తక దుకాణాలు, ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ రూపంలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం ప్రారంభించిన కొత్త ఎన్‌సీఎఫ్‌కి అనుగుణంగా 1 నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులకు పాఠ్యపుస్తకాలను రాబోయే విద్యా సంవత్సరంలో ప్రవేశపెడతామని గతేడాది నవంబర్ 10న ఎంఓఈ తెలిపింది. గత సంవత్సరం పాఠ్యపుస్తకాలను రూపొందించే బాధ్యత కలిగిన కరిక్యులర్ ఏరియా గ్రూప్‌లకు.. ఎన్‌సీఈఆర్‌టీ అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల తుది ముసాయిదాను సమర్పించడానికి గడువు ఫిబ్రవరి 10 అని సూచించింది. 3వ తరగతికి సంబంధించిన పాఠ్యపుస్తకాల డ్రాఫ్ట్‌లు అందాయని ఎంఓఈ వర్గాలు చెబుతున్నాయి. 6వ తరగతికి సంబంధించి గణితం, సైన్స్, భాషలు (ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సంస్కృతం) పాఠ్యపుస్తక ముసాయిదాలు కూడా ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నాయి. చరిత్ర, భౌగోళిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం సామాజిక శాస్త్రం ఒక పాఠ్య పుస్తకంలో విలీనం చేయబడే అవకాశం ఉన్నది.