ఈ లోకం

పడుకుంటే లేవమంటుంది
మేలుకుంటే కూర్చోమంటుంది
కూర్చుంటే నిలబడమంటుంది
నిలుచుంటే నడవమంటుంది
నడుస్తుంటే పరుగెత్తమంటుంది
పరుగెడుతుంటే పరిహసిస్తుంది
ఆగితే అదిలించుతుంది
అలసినా సొలొసినా
పట్టించుకోదు పరామర్శించదు

తోచిందంతా చెబుతుంది
చెప్పిందంతా వినమంటుంది
వినిందంతా చెయ్యమంటుంది
చేసిందంతా మరచిపొమ్మంటుంది
ప్రతిఫలమేమీ ఆశించవద్దంటుంది
నచ్చిందంతా పొగుడుతుంది
మెచ్చిందంతా మంచిదంటుంది
ఇష్టమైనా కష్టమైనా
పాటించమంటుంది
ప్రాముఖ్యం పొందమంటుంది

లోకాన్ని ఎరగరా
లౌక్యంగా మెలగరా
ఏటికెదురుగా ఈదకురా
ఎండనునుపట్టి గొడుగునెత్తరా

– గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్‌

Spread the love