ఆ అవినీతిపరులను కఠినంగా శిక్షించాలి

– మేడిగడ్డపై ప్రొఫెసర్‌ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంజినీర్ల సూచనలను పట్టించుకోని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌ ఒకలా, నిర్మాణం మరోలా చేయడంతోనే బ్యారేజీ కుంగిందని టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ విమర్శించారు. ఆ ప్రాజెక్టులో అవినీతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌ లోని టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు సంబంధించి వాస్తవాలు ప్రజలకు తెలియకుండా కేసీఆర్‌ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టు నిర్మించడం సరికాదని ఇంజినీర్లు సూచించిన్పటికీ అక్కడే నిర్మించిందని గుర్తుచేశారు. దానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కాగ్‌ తప్పుపట్టిందని కోదండరామ్‌ వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ మెటీరియల్‌ సక్రమంగా లేదని, నిర్వహణ కూడా సరిగ్గా లేదని డ్యామ్‌ సేఫ్టీ అధికారులు నివేదికలో చెప్పారని తెలిపారు. బొగ్గు గనులను వేలం ప్రయివేటీకరణకు దారి తీస్తుందని, వాటిని సింగరేణికే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాలపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌కు తాము రెండు సార్లు పూర్తి సమాచారంతో నివేదికను సమర్పించినట్టు తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద ఇప్పటికే రూ.800 కోట్ల ఖర్చుతో కాలువ పనులను చేపట్టారనీ, ఇక్కడి నుంచి నీటిని తీసుకునే అవకాశాన్ని పరిశీలించాలని కమిషన్‌ ను కోరినట్టు కోదండరామ్‌ వివరించారు.

Spread the love