
– బీజేపీ కౌన్సిలర్ల హై డ్రామా..?
– పెద్ద తలకాయలు సహకరించారా..!
– క్యాంపు లో పావని ఎందుకు లేదు,
– అతివిశ్వాసం ముంచిందా,
– చివరికి వీగిపోయిన అవిశ్వాసం.
నవ తెలంగాణ-సూర్యాపేట
మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటి నుంచి చివరి వరకు వీగిపోవడంలో దిలిప్ వర్గానికి హ్యాండ్ ఇచ్చిందేవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మున్సిపాలిటీ లలో చైర్మన్ల పై అవిశ్వాసాల జోరు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా లోని మెజార్టీ మున్సిపాలిటీ లలో బి.ఆర్.యస్ చైర్మన్, వైస్ ఛైర్మన్ లపై అవిశ్వాసాల తీర్మానాల హోరు సాగింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క సూర్యాపేట లో మాత్రమే ఎమ్మెల్యే గా జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించగా…. ఇక్కడి మున్సిపాలిటీ లో బి.ఆర్.యస్ కౌన్సిలర్లు మెజార్టీ స్థానాల్లో ఉండడం,కాంగ్రెస్, బీజేపీ లకు తగినంత బలం లేనందున ఇక ఇక్కడ అవిశ్వాసం ఉండక పోవచ్చని అందరూ భావించారు.కానీ అనూహ్య రీతిలో బి.ఆర్.యస్ కు చెందిన కొండపల్లి దిలిప్ రెడ్డి తిరుగుబాటు చేసి తన భార్య 31 వ వార్డు కౌన్సిలర్ నిఖిల ను చైర్ పర్సన్ గా చేయాలని తలంచి 16 మంది కౌన్సిలర్లతో బయటికి వచ్చారు.అనంతరం ఆయన కాంగ్రెస్, బీజేపీ, బిఎస్పి, పటేల్ రమేష్ రెడ్డి వర్గ్యుల కౌన్సిలర్లతో చర్చించారు. ఇదే కాకుండా వీరికి సంబంధించిన అది నాయకత్వం తో దిలిప్ సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం సాగింది.వారి నుండి అవిశ్వాస తీర్మానంపై పూర్తి భరోసా తీసుకొని దిలిప్ 32 మంది కౌన్సిలర్ల సంతకాలు సేకరించి ఈనెల 10 న కలెక్టర్ వెంకట్రావు కు అవిశ్వాస తీర్మానం పై నోటీస్ అందజేసిన విషయం తెల్సిందే. దీనిపై 27 వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ ప్రకటించారు.ఈ ప్రకటన తర్వాత దిలిప్ కు ఎవరిచ్చిన భరోసాతోనో తెలియదు కానీ తన వెంట ఉన్న 16 మంది బి.ఆర్.యస్ కౌన్సిలర్లను తీసుకొని హైదరాబాద్ లోని కాస్ట్లీ హోటల్ లో ఉంచారు.ఇక్కడ మాజీమంత్రి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం తో పాటు తదితర ప్రధాన నాయకులు శిబిరంలో ఉన్న వారిని కలిసినట్లుగా ప్రచారం సాగింది. కాగా దిలిప్ శిబిరం తమ వద్ద ఉన్న వారే కాకుండా మరి కొందరు కౌన్సిలర్లను తన వెంట తీసుకెళ్ళేందుకు సూర్యాపేట లో ప్రయత్నాలు చేశారు.ఇది తెలుసుకున్న
హ్యాట్రిక్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తన కౌన్సిలర్లలో చైర్మన్, వైస్ చైర్మన్ లను సూర్యాపేట లొనే ఉంచి మిగతా వారిని బాంబే కు తరలించి జాగ్రత్త పడ్డారు.ఈ క్రమంలో దిలిప్ కు మద్దతుగా ఉన్న పెద్ద తలకాయలో ఒకరు మనకు 32 మంది మద్దతు సరిపోతుందని ఇక వేరే వారికోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదని…వారు వస్తే కౌన్సిలర్ టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో దిలిప్ పెద్దలపై నమ్మకంతో బీజేపీ, కాంగ్రెస్, బిఎస్పి లకు చెందిన కౌన్సిలర్లలో కొందరిని సూర్యాపేటలోనే వదిలి మిగతా వారిని తీసుకొని హైదరాబాద్ నుండి ఊటీ అటు నుంచి సేలం లకు తరలించారు.ఇక బీజేపీ, కాంగ్రెస్, బిఎస్పి కౌన్సిలర్లు కొందరూ మాత్రం సూర్యాపేటలోనే ఉండడం గమనార్హం. ఇక అవిశ్వాస తీర్మానానికి గడువు ఒక్క రోజే ఉండడంతో దిలిప్ శిబిరం సేలం నుండి శుక్రవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక చైర్మన్ పదవి దక్కడం ఖాయమని ఆనందపడ్డారు.ఈ సమయంలోనే సూర్యాపేట లో మిగిలిన కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు హైదరాబాద్ లోని క్యాంపు కు తరలి వెళ్లారు. కాగా ఇక్కడే బీజేపీ కి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు హైదరాబాద్ కు రాగానే వారిని జగదీష్ రెడ్డి వర్గ్యులు క్యాచ్ చేసి బాంబే కు తరలించారు. దీంతో దిలిప్ శిబిరం లో ఆందోళన వ్యక్తం అయింది. వెంటనే వారు తేరుకొని బీజేపీ కి చెందిన ప్రధాన నాయకుడి కి హై లెవల్ లో ఫోన్ చేసి తక్షణమే ఆ ముగ్గురు కౌన్సిలర్లను తమ శిబిరానికి వచ్చేటట్లు చేయాలని హుకమ్ జారీ చేసినట్లు తెలుస్తోంది. భయపడిన ఆ బీజేపీ నేత వెంటనే బాంబేలో ఉన్న తన కౌన్సిలర్లను వెంటనే హైదరాబాద్ కు రావాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కౌన్సిలర్లు గుడికి వెల్లుతామని చెప్పి జగదీష్ రెడ్డి శిబిరం నుంచి జంప్ అయ్యారు. ఈ పరిణామం తో ఖంగ్ తిన్న జగదీష్ రెడ్డి వర్గ్యులు వెంటనే తేరుకొని సూర్యాపేట లో ఉన్న 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ తో మాట్లాడి శుక్రవారం అర్ధరాత్రి ఇంటి నుంచి రాష్ట్రం దాటించారు. ఒక్క నైట్ లొనే రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. ఇక పోయిన ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు తిరిగి వచ్చారని దిలిప్ శిబిరం
సంతోషపడ్డది.ఇక 27 న ఉదయం తన మద్దతు దారులను తీసుకొని దిలిప్ ప్రత్యేక వాహనం లో సూర్యాపేట కు బయలు దెరుతున్న క్రమంలో సూర్యాపేటలో ఉన్న గండూరి పావని ని జగదీష్ రెడ్డి వర్గ్యుల కంట్రోల్ లోకి వెళ్లినట్లు తెలుసుకొని షాక్ కు గురయ్యారు. సమయం దగ్గర పడుతున్న టెన్షన్ లో దిలిప్ రెడ్డి వెంటనే మరో కౌన్సిలర్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ముందుగానే జగదీష్ రెడ్డి తన కౌన్సిలర్లను లక్ష్యదీప్ లోని సముద్రంలో క్రూయిజ్ షిప్ లో ఉంచి వారిని నాలుగు రోజుల పాటు సముద్రం లొనే అందుబాటులో లేకుండా చేసి సఫలీకృతులయ్యారు.ఇక దిలిప్ శిబిరం ఒక్క కౌన్సిలర్ కోసం ఎంతో శ్రమించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.32 మందిలో ఒక్క కౌన్సిలర్ మిస్ తో అవిశ్వాసం వీగిపోయి చైర్మన్ పదవి ని కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ 32 సంఖ్య వద్దనే ఫిక్స్ కావడం వారిని నష్ట పర్చినట్లుగా అయింది. ఎక్స్ ట్రా కౌన్సిలర్ల కోసం ప్రయత్నం చేయడం లో అవిశ్వాసాన్ని ప్రెస్టీజి గా తీసుకున్న పెద్ద తలకాయలు వైఫల్యం చెందాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కనీసం సూర్యాపేటలొనే ఉన్న గండూరి పావని కృపాకర్ ని కూడా రక్షితంగా ఉంచుకోలేక విఫలం చెందారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నమ్ముకున్న పెద్ద తలకాయలో ఒకరు గేమ్ ఆడడం…. …మరొకరు 32 మంది కౌన్సిలర్లు చాలు అని డిసైడ్ కావడం…సూర్యాపేట లో మిగిలి ఉన్న గండూరి పావని ని విస్మరించడం లాంటి నెగ్లెెన్సీ స్పష్టంగా కనిపిస్తుంది.ఇంకా వీరి బృందo వెంట అగ్ర నేతల నాయకత్వ పర్యవేక్షణ లేకపోవడం కూడా ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ఏదిఏమైనా 17 రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన అవిశ్వాస తీర్మానం ఎపిసోడ్ లో అతివిశ్వాసం తో చైర్ పర్సన్ పదవి “చే” జారినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.