గాంధీభవన్‌ వద్ద టికెట్ల లొల్లి

Ticket booth at Gandhi Bhavan– పటాన్‌చెరు టికెట్‌పై నిరసన
– వనపర్తి అభ్యర్థి మార్పుపై ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గాంధీభవన్‌ వద్ద టికెట్ల లొల్లి జరిగింది. కాంగ్రెస్‌ మూడో జాబితాలో రెండు పేర్లు మార్చడం, పటాన్‌చెరు నియోజకవర్గానికి కాట శ్రీనివాస్‌గౌడ్‌ను కాదని పార్టీలో కొత్తగా చేరిన నీలం మధుకు టికెట్‌ కేటాయించడం పట్ల నిరసనలు తెలిపారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయా నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ టికెట్‌ ఆశించిన కాట శ్రీనివాస్‌గౌడ్‌ అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితులతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు.కొంత మందిని అరెస్టు చేశారు. పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఇదిలా ఉండగా పటాన్‌చెరు టికెట్‌ కాట శ్రీనివాసగౌడ్‌కు ఇవ్వకపోవడం పట్ల మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రమేయం లేకుండానే జహీరాబాద్‌ టికెట్‌ కేటాయించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా ఆయన తన పదవికి రాజీనామా చేస్తారనే వార్తలొచ్చాయి. దీంతో అధిష్టానం పెద్దలు ఆయనకు ఫోన్‌ చేసినట్టు తెలిసింది. గాంధీభవన్‌ వద్ద ఆందోళనలు నిలిపేయాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పటాన్‌చెరు అభ్యర్థి నీలం మధును కొనసాగిస్తారా? లేదా? అనేది తెలియాల్సి వుంది.

Spread the love