Tuesday, April 21, 2026
E-PAPER
Homeఆటలుతిలక్‌ తడాఖా

తిలక్‌ తడాఖా

- Advertisement -

అజేయ సెంచరీతో చెలరేగిన వర్మ
టైటాన్స్‌పై ముంబయి 99 పరుగులతో గెలుపు

ముంబయి 199/5 గుజరాత్‌ 100/10

ముంబయి ఇండియన్స్‌ జూలు విదిల్చింది. గుజరాత్‌ టైటాన్స్‌పై పంజా విసిరింది. 99 పరుగులతో టైటాన్స్‌పై భారీ విజయం సాధించింది. తిలక్‌ వర్మ (101 నాటౌట్‌) అజేయ సెంచరీతో తొలుత 199 పరుగులు చేసిన ముంబయి ఇండియన్స్‌.. బౌలర్ల విజృంభణతో గుజరాత్‌ టైటాన్స్‌ను 100 పరుగులకే ఆలౌట్‌ చేసింది. వరుసగా 4 పరాజయాల తర్వాత ముంబయి ఇండియన్స్‌ గెలుపు బాట పట్టింది.
నవతెలంగాణ-అహ్మదాబాద్‌

తెలుగు తేజం తిలక్‌ వర్మ (101 నాటౌట్‌, 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. పడుతూ లేస్తూ..ఉప్పెనలా విరుచుకుపడిన తిలక్‌ వర్మ గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లను వేటాడాడు. ఓ దశలో 22 బంతుల్లో 19 పరుగులే చేసిన తిలక్‌ వర్మ.. 45 బంతుల్లోనే 101 పరుగులతో విశ్వరూపం చూపించాడు. తిలక్‌ వర్మకు తోడు నమన్‌ ధిర్‌ (45, 32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించటంతో ముంబయి ఇండియన్స్‌ తొలుత 199/5 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ చేతులెత్తేసింది. బౌలర్లు అశ్వని కుమార్‌ (4/24), గజాన్‌ఫర్‌ (2/17), మిచెల్‌ శాంట్నర్‌ (2/16) సమిష్టిగా మెరవటంతో టైటాన్స్‌ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. టైటాన్స్‌ తరఫున వాషింగ్టన్‌ సుందర్‌ (26, 17 బంతుల్లో 5 ఫోర్లు) ఒక్కడే చెప్పుకోదగిన ప్రదర్శన కనబరిచాడు. 99 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబయి ఇండియన్స్‌.. వరుస పరాజయాలకు చెక్‌ పెడుతూ అదిరే విజయం ఖాతాలో వేసుకుంది. శతక ప్రదర్శన చేసిన తిలక్‌ వర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఆరు మ్యాచ్‌ల్లో ముంబయి ఇండియన్స్‌కు ఇది రెండో విజయం కాగా.. గుజరాత్‌కు ఇది మూడో ఓటమి.
టైటాన్స్‌ చతికిల
గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్లు ఫామ్‌లో ఉండటంతో 200 పరుగుల లక్ష్యం ఊరించింది. కానీ ముంబయి ఇండియన్స్‌ బౌలర్లు ఇన్నింగ్స్‌ తొలి బంతి నుంచే వికెట్ల వేట మొదలెట్టారు. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (0) వికెట్‌తో జశ్‌ప్రీత్‌ బుమ్రా వికెట్ల దాహం తీర్చుకుని ముంబయికి అదిరే ఆరంభం అందించాడు. జోశ్‌ బట్లర్‌ (5), శుభ్‌మన్‌ గిల్‌ (14) నిష్క్రమణతో టైటాన్స్‌ 40/3తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో వాషింగ్టన్‌ సుందర్‌ (26) ఒక్కడే కాసేపు బౌలర్లను ప్రతిఘటించాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌ (6), రాహుల్‌ తెవాటియ (8), రషీద్‌ ఖాన్‌ (4), మహ్మద్‌ సిరాజ్‌ (0) తేలిపోయారు. షారుక్‌ ఖాన్‌ (17, 13 బంతుల్లో 1 సిక్స్‌, 1 ఫోర్‌) ఓటమి అంతరం కుదించాడు. ముంబయి ఇండియన్స్‌ పేసర్‌ అశ్విని కుమార్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా… స్పిన్నర్లు మిచెల్‌ శాంట్నర్‌, గజాన్‌ఫర్‌లు మరో నాలుగు వికెట్లు కూల్చారు. దీంతో 15.5 ఓవర్లలో 100 పరుగులకే టైటాన్స్‌ కథ ముగిసింది.
శతక్కొట్టిన తిలక్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌కు ఆరంభం కలిసి రాలేదు. 44/3తో పవర్‌ప్లేలో ఆ జట్టు ఇబ్బంది పడింది. ఓపెనర్లు డానీశ్‌ మాలెవర్‌(2), క్వింటన్‌ డికాక్‌ (13) సహా సూర్యకుమార్‌ యాదవ్‌ (15) స్వల్ప స్కోరుకే నిష్క్రమించారు. ఈ స్థితిలో నమన్‌ ధిర్‌ (45), తిలక్‌ వర్మ (101 నాటౌట్‌) నాల్గో వికెట్‌కు 40 బంతుల్లో 52 పరుగులు జోడించారు. తిలక్‌ వర్మ పరుగుల వేటలో తడబాటుకు గురయ్యాడు. ఎదుర్కొన్న తొలి 22 బంతుల్లో 19 పరుగులే చేశాడు. కానీ ఇన్నింగ్స్‌ నడుమ విరామం తిలక్‌ వర్మ ఇన్నింగ్స్‌ను మార్చివేసింది. సునామీలా విరుచుకుపడిన తిలక్‌ వర్మ సిక్సర్లు, ఫోర్లతో విశ్వరూపం చూపించాడు. 3 ఫోర్లు,3 సిక్స్‌లతో 33 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన తిలక్‌.. సెంచరీ చేరుకునేందుకు మరో 12 బంతులే ఆడాడు. తిలక్‌ వర్మ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చివరి 4 ఓవర్లలో ముంబయి ఇండియన్స్‌ ఏకంగా 73 పరుగులు పిండుకుంది. నమన్‌ ధిర్‌ అర్థ సెంచరీ ముంగిట నిష్క్రమించినా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (15)తో కలిసి తిలక్‌ వర్మ ఐదో వికెట్‌కు 38 బంతుల్లోనే 81 పరుగులు జోడించాడు. ఓ వైపు తిలక్‌ దంచికొట్టగా.. హార్దిక్‌ పాండ్య దూకుడుగా ఆడలేదు. 16 బంతుల్లో ఒక్క బౌండరీతో కేవలం 15 పరుగులే చేశాడు. అయినా, తిలక్‌ తుఫాన్‌తో ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో కగిసో రబాడ (3/33), మహ్మద్‌ సిరాజ్‌ (1/25), ప్రసిద్‌ కృష్ణ (1/54) రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -