– నేటి నుంచి ఎస్‌ఏ20 లీగ్
జొహనెస్‌బర్గ్ : 2024 మినీ ఐపీఎల్‌తో ఆరంభం కానుంది!. అవును, ఎస్‌ఏ (దక్షిణాఫ్రికా) 20 లీగ్ నేటి నుంచి షురూ కానుంది. ఎస్‌ఏ20 లీగ్‌ను క్రికెట్ దక్షిణాఫ్రికా నిర్వహిస్తున్నా.. అందులో పోటీపడుతున్న ఆరు జట్లు పూర్తిగా ఐపీఎల్ ప్రాంఛైజీలే. దీంతో ఎస్‌ఏ20 లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రాంఛైజీ క్రికెట్, జాతీయ క్రికెట్ చర్చలో వివాదం రేపుతున్న ఈ లీగ్ రెండో సీజన్‌కు రంగం సిద్ధం చేసుకుంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. జోబర్గ్ సూపర్‌కింగ్స్, ఎంఐ కేప్‌టౌన్, పార్ల్ రాయల్, ప్రిటోరియ క్యాపిటల్స్, డర్బన్స్ సూపర్‌జెయింట్స్ టైటిల్ వేటలో నిలిచాయి. ఐపీఎల్ ప్రాంఛైజీలు చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్‌జెయింట్స్ సహా సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు ఎస్‌ఏ20 లీగ్‌లో జట్లను సొంతం చేసుకుని గ్లోబల్ క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. 32 రోజులు, 34 మ్యాచులతో సాగే ఎస్‌ఏ20.. ఐపీఎల్ తరహాలోనే క్వాలిఫయర్, ఎలిమినేటర్ పద్దతిలో జరుగనుంది. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఇతర ఐదు జట్లతో రెండు మ్యాచులు ఆడనుంది. ఒక్కో జట్టు పది మ్యాచులు లీగ్ దశలో పోటీపడనుంది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి. టాప్-2లో నిలిచిన జట్లకు ఫైనల్‌కు చేరుకునేందుకు రెండు అవకాశాలు లభిస్తాయి. తొలి మ్యాచ్‌లో నేడు డిఫెండింగ్ చాంపియన్ ఈస్టర్న్ కేప్‌తో సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. ఈస్టర్న్ కేప్‌కు ఎడెన్ మార్‌క్రామ్ సారథ్యం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 10న కేప్‌టౌన్ వేదికగా ఎస్‌ఏ20 టైటిల్ పోరు జరుగుతుంది.