– రేపటి నుంచి భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్
వైట్‌బాల్ ఫార్మాట్‌లో అరివీర భయంకర జట్లు భారత్, ఇంగ్లాండ్. కుర్రాళ్ల మెరుపులతో టీమ్ ఇండియా ఈ ఫార్మాట్‌లో పరుగుల సునామీ సృష్టిస్తోంది. మరోవైపు బ్రెండన్ మెక్‌కల్లమ్ శిక్షణ సారథ్యంలో ఇంగ్లీశ్ బ్యాటర్లు టెస్టుల్లో సైతం చెలరేగిపోతున్నారు, ఇక టీ20ల్లో సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ రెండు జట్లు పొట్టి ఫార్మాట్‌లో తలపడేందుకు సిద్ధమవుతుంటే.. రికార్డులు బద్దలయ్యేందుకు ఎదురుచూస్తున్నాయి!.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఆధునిక క్రికెట్ ధనాధన్‌కు చిరునామా. అటువంటి మోడ్రన్ క్రికెట్‌లోనే దంచికొట్టేందుకు సరికొత్త ప్రణాళికలతో హడలెత్తిస్తున్న జట్లలో భారత్, ఇంగ్లాండ్ ముందంజలో ఉంటాయి. గత ఏడాది కాలంగా భారత్, ఇంగ్లాండ్‌లు పరుగుల సునామీ సృష్టించటంలో పోటీ పడుతున్నాయి. ఇటీవల వరుసగా టెస్టు క్రికెట్ అభిమానులను అలరించగా.. ఇప్పుడు టీ20 ధమాకా ముందుకొచ్చింది. భారత్, ఇంగ్లాండ్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్ బుధవారం నుంచి ఆరంభం కానుంది. దీంతో, ఐపీఎల్‌కు ముందే భారత్‌లో ధనాధన్ హంగామా మొదలు కానుంది.
దంచుడే దంచుడు
సంప్రదాయ బ్యాటింగ్ శైలిలో భారత్ టీ20ల్లో దూకుడుగా ఆడటం లేదనే విమర్శ చేయడానికి ఇప్పుడు ఎవరూ సాహసించరు. టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం సీనియర్లు ఈ ఫార్మాట్‌కు దూరం కాగా… కుర్రాళ్లు కొత్తగా రెచ్చిపోతున్నారు. టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్ 11 మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేయగా అందులో ఏడు సార్లు 200కి పైగా పరుగులు చేసింది. అందులో 297, 283 వంటి రికార్డు స్కోర్లు ఉన్నాయి. ప్రతి 4.27 బంతులకు ఓ బౌండరీ బాదుతున్నారు. ప్రతి 2.18 బంతులకు ఓ బౌండరీ ప్రయత్నం చేస్తున్నారు. ఛేదనలోనూ మనోళ్లు అదరగొడుతున్నారు. 132 పరుగుల టార్గెట్‌ను 11.5 ఓవర్లలో ఊదేయగా.. 156 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో ముగించారు. భారత జట్టులో సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్‌లు ఉండగా.. ఇంగ్లాండ్ శిబిరంలో జోశ్ బట్లర్, ఫిల్ సాల్ట్, లియాం లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్‌లు ఉన్నారు. ఇంగ్లాండ్ సైతం ప్రతి 2.32 బంతులకు బౌండరీ ప్రయత్నం చేస్తోంది. ధనాధన్ హిట్టర్లు క్రీజులో నిలిచే సిరీస్‌లో ఓవర్‌కు పదిలోపు పరుగులిచ్చే బౌలర్లు మ్యాచ్ ఫలితాన్ని శాసించనున్నారు.
రికార్డులు బహు పరాక్!
2023 మార్చిలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలు మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో తలపడ్డాయి. టీ20 క్రికెట్ చరిత్రలో ఆ సిరీస్‌కు ఓ ప్రాముఖ్యత ఉంది. నాలుగు రోజుల వ్యవధిలో ముగిసిన ఈ సిరీస్‌లో పరుగుల ప్రవాహానికి అడ్డు లేదు. తొలి మ్యాచ్‌లో సఫారీలు 11 ఓవర్లలో 131 పరుగులు చేసినా ఓడారు. రెండో మ్యాచ్‌లో సఫారీలు 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. మూడో మ్యాచ్‌లో విండీస్ 220 పరుగులను పడుతూ లేస్తూ కాపాడుకుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్ల స్కోరింగ్ రేట్ 12.08. ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనే ఇదే అత్యధికం. అగ్ర జట్లు తలపడిన టీ20 సిరీస్‌లో రెండో ఉత్తమ స్కోరింగ్ రేట్ 10.69. తాజా భారత్, ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ రికార్డు బద్దలు అయ్యే ప్రమాదం ఉంది. టీ20 మ్యాచులు వేదికలు కోల్‌కత, ముంబయి, రాజ్‌కోట్‌లు భారీ స్కోర్లకు నెలవు. రెండు జట్లలో భారీ హిట్టర్లు, రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో పలు రికార్డులు బద్దలు కావటం లాంఛనమే.