బదిలీలకు వేళాయే..!

Time for transfers..!– కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు..
– జూన్‌ రెండో వారంలో స్థానభ్రంశం..!
– ఎన్నికల కోడ్‌ ముగిశాక ప్రక్రియ షురూ
నవతెలంగాణ-సిటీబ్యూరో
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ ముగుస్తున్న నేపథ్యంలో అధికారుల స్థాన చలనానికి రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలు పూర్తి కావడం, రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు సంసిద్ధంగా ఉండటంతో అధికారుల బదిలీలకు గ్రీన్‌ సిగల్‌ వచ్చినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 4వతేదీన వెలువడనున్నాయి.
ఈ నెల 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ఒక్కోశాఖ పరిధిలో బదిలీల ప్రక్రియ మొదలు కానుంది. ఈ క్రమంలో జిల్లాల్లో అన్ని శాఖల పరిధిలో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం తప్పనిసరిగా మారింది. ఇప్పటికే చాలా మంది అధికారులు బదిలీల కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు కొందరు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అంతేగాక ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లిన వారంతా తిరిగి వచ్చేందుకు అవకాశాలు వెతుక్కుంటున్నట్టు చర్చ నడుస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారంతా దాదాపు బదిలీలపై వచ్చిన వారే. ఈ క్రమంలో దూరప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి కోరుకున్న చోటుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఏండ్లుగా ఒకే చోట తిష్ట..
కొందరు కలెక్టరేట్‌లో కీలక శాఖల్లో ఏండ్లుగా తిష్ట వేసి పని చేస్తున్నారు. పలు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా సీట్లు వదలడం లేదు. మరి కొందరు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని కోరుకున్న చోట కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి అధికారులకు బదిలీలు ఉండాలని సహచర ఉద్యోగులే కోరుతున్నారు. ఇక రెవెన్యూతోపాటు సాధారణ పరిపాలన, విద్య, వైద్యం, మున్సిపల్‌, పంచాయతీ, వ్యవసాయ, పశు, పౌరసరఫరాల శాఖలతోపాటు ఇతర అన్ని విభాగాల్లో పని చేస్తున్న అధికారులకు బదిలీలు ఉండనున్నాయి.
దాంతో జిల్లా పరిధితోపాటు జోన్‌, మల్టీ జోన్‌ పరిధిలో పని చేస్తున్న అధికారులు అనుకూలమైన చోట పోస్టింగ్‌ కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఎవరికి ఎక్కడ పోస్టింగ్‌ వస్తుందోనని అధికార వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

వైద్య, ఆరోగ్యశాఖ ‘డిప్యూటేషన్‌’పై సస్పెన్స్‌..!
రాష్ట్ర వ్యాప్తంగా వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలు జరగక ఏండ్లవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ట్రాన్స్‌ఫర్స్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది. డీఎంఅండ్‌హెచ్‌ఓ బాధ్యతలు చేపట్టి ఏడాదే కావస్తున్నా.. దాదాపు ఆరేండ్లకుపైగా జిల్లాలోనే ప్రోగ్రాం ఆఫీసర్‌గా పని చేశారు. ఈ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆయన కూడా బదిలీ అయ్యే ఛాన్స్‌ లేకపోలేదు. ఇక ఈ శాఖలో కొందరు ఏండ్లుగా ఒకే చోట తిష్ట వేశారు. ఇందులో రెగ్యులర్‌, కాంట్రాక్టు ఉద్యోగులు సైతం ఉన్నారు. రెండు నెలల క్రితం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య, ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్లను రద్దు చేసినా.. జిల్లాలో సంపూర్ణంగా జరగలేదు. లేని ఎమర్జెన్సీ సృష్టించి కొందరికి డిప్యూటేషన్‌ నుంచి మినహాయింపును ఇచ్చారని సొంతశాఖ ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు. ఈ విషయమై కొందరు ఉద్యోగులు జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేసేందుకు రెడీ అయినా.. వరుస ఎన్నికల నేపథ్యంలో ప్రక్రియ ముందుకు సాగలేదు. డిప్యూటేషన్‌ పేరుతో కలెక్టరేట్‌లో తిష్ట వేసిన కొందరు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో బదిలీల సమయంలో డిప్యూటేషన్ల వ్యవహారాన్ని కూడా పరిగణన లోకి తీసుకుంటారా..? లేదా..? అనే సందిగ్ధం నెలకొంది.
రెవెన్యూ శాఖలో టెన్షన్‌
ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన రెవెన్యూ శాఖలో పూర్తిగా బదిలీలు జరిగే అవకాశం ఉంది. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లు (ఏఆర్వో), రిటర్నింగ్‌ ఆఫీసర్లు (ఆర్వో)గా ఉన్నారు. డీటీ, తహసీల్దార్‌, ఆర్డీవో, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆపై ఆఫీసర్లకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. దాంతో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో చాలా మంది తహసీల్దార్లు, జిల్లా పరిధిలోనే ఉంటూ దూరంగా పని చేస్తున్న అధికారులు తిరిగి తమ స్థానాల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఎక్కువ మంది పైరవీల కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో ఎవరికి ఎక్కడ పోస్టింగ్‌ దక్కుతుందోనని కొందరు టెన్షన్‌ పడుతున్నారు. మండలాలతోపాటు ఇతర కలెక్టరేట్‌లోని ఆయా సెక్షన్ల ఇన్‌చార్జీలు, ఆర్డీవో, ఆఫీసుల్లో సూపరింటెండెంట్‌ పోస్టుల్లో ఉన్న వారిని బదిలీ చేస్తారనే గుబులుతో ఉన్నారు.
వీరికి బదిలీ తప్పనిసరి..!
ప్రభుత్వ ఉద్యోగులకు మూడు, ఐదేండ్లలోపు బదిలీలు చేపట్టాలి. కానీ కొన్ని శాఖల్లో ఏండ్లుగా బదిలీలు లేకపోవడంతో ఉద్యోగులు ఒకే చోట తిష్ట వేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లోని చాలా విభాగాల్లో భారీ ఎత్తున బదిలీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కలెక్టర్‌, అదనపు కలెక్టర్లను సైతం ట్రాన్స్‌ఫర్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా ఇండిస్టీస్‌ జనరల్‌ మేనేజర్‌, మిషన్‌ భగీరథ అధికారి, వ్యవసాయశాఖ అధికారి, తూనికలు కొలతలు అధికారి, హార్టికల్చర్‌ అధికారి, సీ-సెక్షన్‌ ఇన్‌చార్జి, అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ అధికారి, సివిల్‌ సప్లై అధికారి, సీపీఆర్వో తదితర శాఖల అధికారులు బదిలీ అవుతున్నట్టు సమాచారం. ఇక జిల్లా విద్యాధికారి మధ్యలో కొంత కాలం సంగారెడ్డికి బదిలీపై వెళ్లి తిరిగి వచ్చారు. గత అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే బదిలీ అయ్యే ఛాన్స్‌ ఉంది.

Spread the love