టీజేఎస్‌ను ఏ పార్టీలోనూ విలీనం చేయం…

ప్రజాస్వామ్య తెలంగాణ కోసం నిలబడతాం.. : కోదండరాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)ని మరే పార్టీలోనూ విలీనం చేయబోమని ఆ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. రాజకీయా లను కార్పొరేటీకరణచేసిన సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య తెలంగాణ కోసం టీజేఎస్‌ నిలబడుతుందని ఆయన తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీల్లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేట్‌ నుంచి మేడారం వరకు తెలంగాణ బచావో యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. జూలైలో నియోజకవర్గాల పరిధిలో అదే పేరుతో సదస్సులుంటాయని చెప్పారు. రాష్ట్రంలో గ్రీన్‌ ఫీల్డ్‌ బాధితులు, పోడు భూములు, రైతులు, ధరణి, సింగరేణి కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం యాత్రలు చేస్తామని వివరించారు. ప్రజలే కేంద్రంగా తమ రాజకీయాలుంటాయనీ, ఇక నుంచి నియోజకవర్గాల పరిధిలో తమ కార్యచరణ ఉంటుందని వెల్లడించా రు. టీఎస్‌పీఎస్సీ సభ్యులపై దర్యాప్తు చేయకుండా మళ్లీ వారితోనే నోటిఫికేషన్లు, భర్తీ చేపడితే ప్రశ్నాపత్రాలు మళ్లీ లీక్‌ కాకుండా ఉంటాయా? అని ఈ సందర్భంగా కోదండరాం ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా కేసీఆర్‌ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని సవరించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో ప్రయివేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసిన రైతులకు వడ్డీ భారం పెరిగిందని తెలిపారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు రూ.10 వేల చొప్పున సాయం చేస్తామన్న హామీని కేసీఆర్‌ నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు టెండర్లను ఆపడం కోసం పోరాడుతామని తెలిపారు. సంగారెడ్డి నుంచి భువనగిరి వరకు ఇప్పటికే ఉన్న రింగ్‌ రోడ్డును డబుల్‌ రోడ్డు చేస్తే బాగుంటుందని సూచించారు. సింగరేణి కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని విమర్శిచారు. పార్టీ నూతన కమిటీకి ఎన్నికైన వారి పేర్లను ఆయన ప్రకటించారు.

Spread the love