కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవాలంటే…

To reduce cholesterol...ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు చాలా అవసరం.అలా అని వేలకు వేలు పెట్టి ఖరీదైన డైట్‌లు చేయనక్కర్లేదు.  మన ఇంట్లో ఉండే ఎన్నో పదార్థాలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అందులో మెంతులు కూడా ఉన్నాయి. మెంతులని కూరలు, పచ్చళ్ళలో వాడతారని తెలిసిందే. మెంతులు చేదుగా ఉన్నప్పటికీ ఇందులోని పోషకాలు, మినరల్స్‌ శరీరానికి ఎంతో అవసరం. మెంతుల్లో ఫైబర్‌, ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతుల నీరు  తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
జీర్ణక్రియ..
మెంతుల నీటిని రోజూ పరగడుపున తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. దీనిలోని పీచు పదార్థం అజీర్ణం, మలబద్ధకం, వాతాన్ని నయం చేస్తుంది. ఇది ఆహారం నుండి పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది
ఇన్‌ఫ్లమేషన్‌..
మెంతులు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడంలో సాయపడతాయి. కాబట్టి, గౌట్‌, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు వీటిని తీసుకోవచ్చు. మెంతుల్లో ప్రోటీన్‌, ఫైబర్‌, విటమిన్‌ సి, నియాసిన్‌, పొటాషియం, ఐరన్‌, ఆల్కలాయిడ్స్‌ ఉన్నాయి. అసిడిటీ ఉన్నవారు ప్రతిరోజూ ఉదయాన్నే నానబెట్టిన మెంతులు ఓ టీస్పూన్‌ తీసుకోవడం మంచిది.
షుగర్‌..
షుగర్‌ ఉన్నవారికి మెంతులు ఓ గొప్ప ఔషధమని చెప్పొచ్చు. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి కంట్రోల్‌ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతుల నీరు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కనుక మధుమేహం ఉన్నవారు ఈ నీటిని తాగడం మంచిది. మరీ ముఖ్యంగా నానబెట్టి ఆ నీటిని తాగితే మరీ మంచిది.
కొవ్వు కరిగించేందుకు..
అదే విధంగా, మెంతులను ఆహారంలో చేర్చడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది. ముఖ్యంగా రక్తనాళాలల్లో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల కార్డియో వాస్కులర్‌ వంటి వ్యాధులను దూరం చేయడానికి దోహదం చేస్తుంది.
ఇమ్యూనిటీ..
మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. మెంతులు వాడడం వల్ల చర్మంతో పాటు జుట్టుకి కూడా మేలు చేకూరుతుంది.

Spread the love