బిడ్డల ఆకలి తీర్చేందుకే..

To satisfy the hunger of children..– మానవీయ కోణంలో సీఎం ఆలోచనే అల్పాహార పథకం
– 27,147 ప్రభుత్వ పాఠశాలలో 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ది
– ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రులు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవీయతా కోణంలో ఆలోచించి ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ను ప్రారంభించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 23 లక్షల మంది విద్యార్థులకు కడుపు నిండా భోజనం లభిస్తుందని, బడి ప్రారంభానికి ఓ అరగంట ముందు అల్పాహారం అందించనున్నారని తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్‌ హరీశ్‌తో పాటు విద్యార్థులతో కలిసి మంత్రులు సహపంక్తిలో కూర్చుని అల్పాహారం తిన్నారు. వండిన పదార్థాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పని దినాల్లో ప్రతి రోజూ మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన బ్రేక్‌ ఫాస్ట్‌ అందించాలని, శుచి శుభ్రత పాటించాలని నిర్వాహకులకు సూచించారు. చిన్నారులను ఎమ్మెల్యే, కలెక్టర్‌ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రతి రోజూ క్రమం తప్పకుండా బడికి వస్తూ చక్కగా చదువుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం ఏ సంక్షేమ పథకాన్ని తీసుకున్నా ఎంతో ఆలోచించి ప్రారంభిస్తారన్నారు. ఆడ పిల్లల పెండ్లికి కల్యాణలక్ష్మి అందించడం ద్వారా
బాల్య వివాహాలు తగ్గాయని, బాలింతలకు కేసీఆర్‌ కిట్‌ ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలు పెరిగి మాత శిశు మరణాలు తగ్గాయని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించడం వల్ల విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహారం లోపాన్ని తగ్గిస్తుంద ని, తద్వారా వారు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు చదువుపై మరింత దృష్టి పెట్టేందుకు తోడ్పడుతుందని తెలిపారు. అంతేకాకుండా, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందన్నారు. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ద్వారా బోధన చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వెయ్యి రెసిడెన్సియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయగా అందులో సగం బాలికల పాఠశాలలు ఉన్నాయన్నారు. అనంతరం మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువుపట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చేపట్టినదే ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ అని అన్నారు. పంచాయతీరాజ్‌, మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంబీపూర్‌ రాజు, బొగ్గారపు దయానంద్‌, చైర్మెన్‌ శ్రీధర్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మెన్‌ సత్తు వెంకటరమణరెడ్డి, పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ హనుమంతరావు, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, డైరెక్టర్‌ దేవసేన, అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love