నేడే కౌంటింగ్‌

Today is counting– రాష్ట్రవ్యాప్తంగా 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
– సాయంత్రం నాలుగు గంటల వరకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
– మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం
– పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఈసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓట్ల లెక్కింపునకు సమయం రానే వచ్చింది. 20రోజుల ఎదురు చూపులకు మంగళవారం తెరపడనుంది. నాలుగో దశలో భాగంగా రాష్ట్రంలో మే 13న 17 లోక్‌సభ స్థానాలకు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్‌ జరిగింది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ వ్యాప్తంగా 34 కౌంటింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అరగంటకు ఈవీఎంల లెక్కింపు చేపడతారు. అత్యల్పంగా15 రౌండ్లున్న నిజామాబాద్‌ ఫలితం మధ్యాహ్నాం 12 గంటల వరకు రానుంది. అత్యధికంగా 24 రౌండ్లున్న హైదరాబాద్‌, కరీంనగర్‌ ఫలితాలు సాయంత్రం నాలుగ గంటల వరకు రానున్నాయి. కౌంటింగ్‌ పూర్తయ్యాక ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 5 పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్‌లను లెక్కిస్తారు. అనంతరం రిటర్నింగ్‌ అధికారి తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. లెక్కింపును పర్యవేక్షించేందుకు 49 మంది మైక్రో అబ్జర్వర్లు, 2,440 మంది సహాయ మైక్రో అబ్జర్వర్లను ఈసీ నియమించింది. కౌంటింగ్‌ను మానిటరింగ్‌ చేయడం కోసం హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో వార్‌ రూంను ఏర్పాటు చేశారు. మరో వైపు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో లిక్కర్‌ షాపుల మూసివేయనున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు హాల్‌ వద్ద 100 మీటర్ల వరకు 144 సెక్షన్‌ విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బంది ఏర్పాట్లు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 3,32,16,348 మంది ఓటర్లకు గాను 2,20,24,806 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలతో సహా మొత్తం 525 మంది అభ్యర్థుల భవితవ్యం మరి కొద్ది గంటల్లో తేలనుంది.
కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
దేశంతో పాటు రాష్ట్రంలోనూ నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్న తరుణంలో పోలీసు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మంగళవారం, తెలంగాణలోని 17 లోక్‌సభతో పాటు సికింద్రాబాద్‌ కంటో న్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్టు రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజరు కుమార్‌ జైన్‌ సోమవారం తెలిపారు. 34 కౌంటింగ్‌ కేంద్రాల వద్ద తొలి దశలో సీఆర్పీఎఫ్‌, రెండో దశలో టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్స్‌, మూడో దశలో సివిల్‌ పోలీసులు కాపలా కాసేలా సెక్యూరిటీని పటిష్టం చేశామని చెప్పారు.

Spread the love