Monday, August 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునేడు జైల్‌ ‌భరో

నేడు జైల్‌ ‌భరో

- Advertisement -

జయప్రదానికి కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు
హైదరాబాద్‌‌లో చలో రాజ్‌‌భవన్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఢిల్లీలో యువత పోరాటం ముగిసిందో లేదో దేశంలో మరో పోరాటానికి రంగం సిద్ధమైంది. గతంలో నిర్వహించిన రైతాంగ పోరాటం సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నదాతలు…శ్రామికవర్గాన్ని కట్టుబానిసలుగా మార్చే లేబర్‌ ‌కోడ్‌‌లు తమకొద్దంటూ కార్మికులు…తమకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పొట్టగొట్టొద్దంటూ వ్యవసాయ కూలీలు కలిసికట్టుగా మరో పోరాటానికి సంసిద్ధులయ్యారు. అందులో భాగంగా క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సోమవారం కార్మికులు, కర్షకులు, కూలీలు సంయుక్తంగా జైల్‌‌భరో కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇది ఈ ఒక్క రోజుతో ఆగబోదనీ, కేంద్రంలోని బీజేపీ విధానాలపై దేశవ్యాప్తంగా సంఘటిత పోరాటాలకు నాంది కాబోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఆ దిశగా కార్యాచరణను రూపొందించుకుని ముందుకెళతామని ప్రకటించారు. గతంలో ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి, నిన్నటి జంతర్‌ మంతర్‌ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న వర్గ సంఘాలే ఈ పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ ‌మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి జైల్‌‌భరోను తలపెట్టాయి. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌‌లో చలో రాజ్‌‌భవన్‌ ‌కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాలు, డివిజన్‌, మండల, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇప్పటికే జిల్లాల్లో సదస్సులు నిర్వహించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1,580 సెంటర్లలో జీపుజాతాలు, నాలుగు వేల గ్రామాల్లో సభలు, 480 పారిశ్రామిక ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్‌ ‌మీటింగ్‌‌లు,వందలాది మందితో పరిశ్రమల వద్ద గేటు మీటింగ్‌‌లు నిర్వహించారు. ఐదు లక్షల కరపత్రాలను కార్మికులకు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. జైల్‌ ‌భరో కార్యక్రమంలో భాగంగా పలు జిల్లాల్లో చేపట్టబోయే నిరసనల్లో రాష్ట్ర నేతలు పాల్గొంటారు. హైదరాబాద్‌‌లో చేపట్టబోయే ‘చలో రాజ్‌ ‌భవన్‌’ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ ‌వెంకట్రాములు పాల్గొంటారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో, ఉపాధ్యక్షులు ఎస్‌ ‌వీరయ్య గోదావరి ఖనిలో పాల్గొంటారు. ఖమ్మంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షలు పోతిరేని సుదర్శన్‌‌రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొంటారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య మహబూబాబాద్‌‌లో పాల్గొననున్నారు. ​​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -