– స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు
– విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు తగ్గటం పట్ల ఆగ్రహం
– యూనియన్లపై జెవియర్ ప్రభుత్వం కన్నెర్ర
బ్యూనస్‌ఎయిర్స్ : అర్జెంటీనాలో కార్మిక సంఘాలు సమ్మె బాటపట్టాయి. ఆర్థిక సంస్కరణల పేరుతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆ దేశ ప్రభుత్వంపై కార్మిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జెవియర్ ప్రభుత్వం తన చర్యలను ఉపసంహరించు కోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమానికి నిధులు కోత పెడుతున్నారనీ, విద్య, వైద్య రంగాలకు నగదు కేటాయింపులు తగ్గిస్తున్నారని కార్మిక సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ద్రవ్యోల్బణంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నా రు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను, పెన్షన్లు కట్ చేయడం సరైన పద్ధతి కాదనీ, ఈ తరహా చర్యలను ఉపసంహరించుకోవాలని యూనియన్ సంఘాలు ప్రభుత్వా నికి సూచిస్తున్నాయి. సమ్మె కారణంగా పలు రాకపోకలు నిలిచిపోయాయి.
బస్సు, రైళ్లు, విమానాల రవాణా సేవలు స్తంభించాయి. ప్రభుత్వ దవాఖానా లు, స్కూల్స్, బ్యాంకులు, పోస్టల్ సర్వీసులను బంద్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా సమ్మెకు సంఘీభావం ప్రకటించి, ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇటు సమ్మెపై జెవియర్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. రాజకీయ కుట్రలో భాగంగా పలువురు ఈ చర్యలకు పాల్పడ్డారని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ప్రస్తుతం దేశం ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్నదనీ, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే ఈ సంస్కరణలు అవసరమని ప్రభుత్వం వివరించింది. అయితే, ప్రతిపక్ష నాయకులు దీన్ని ప్రజా వ్యతిరేక విధానమని ఖండించారు.