– బోడుప్పల్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
– బొల్లారం పీఎస్‌కు తరలింపు
నవతెలంగాణ-బోడుప్పల్: తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూపోరాటం బోడుప్పల్ సర్కిల్ లోని బొల్లిగూడంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఉప్పల్ బాగాయత్‌లో నిర్వహించాలనుకున్న సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో వేదికను బోడుప్పల్ సర్కిల్ లోని బొల్లిగూడానికి మార్చిన నాయకత్వం అక్కడ కూడా అడ్డంకులను ఎదుర్కొంది. సభ ఏర్పాట్ల కోసం టెంట్లు వేస్తుండగా పోలీసులు భారీ బలగాలతో చేరుకుని అనుమతి లేదని స్పష్టం చేస్తూ వాటిని తొలగించారు.
దీంతో కార్యకర్తలు నిరసనకు దిగడంతో పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. భూపోరాటంలో పాల్గొనడానికి వచ్చిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు ముందుగానే అడ్డుకుని అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.కవిత అరెస్టుతో ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు, ల్యాండ్ పూలింగ్ విధానానికి మద్దతుగా ఉన్న స్థానిక దళితులు కూడా తెలంగాణ రక్షణ సేనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను ఘట్‌కేసర్ సహా పలు పోలీస్ స్టేషన్లకు తరలించగా, వారి విడుదల కోసం కార్యకర్తలు పోలీస్ స్టేషన్ల ఎదుట నిరసనలు చేపట్టారు. ప్రస్తుతం బోడుప్పల్ సర్కిల్ లోని బొల్లిగూడం పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.


