మాంద్యానికి ట్రంప్‌ ఆజ్యం

Trump is fueling the recession– సంక్షోభానికి 60 శాతం అవకాశం
– యూఎస్‌లో ఉద్యోగాలుండవ్‌
– జెపి మోర్గాన్‌ అంచనా
వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించనున్నారని అంతర్జాతీయ సంస్థలు గగ్గొలు పెడుతోన్నాయి. వాణిజ్య యుద్ధానికి తెర లేపి ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లను కుప్పకులేలా చేసిన ట్రంప్‌ విధానాలు మరిన్ని ప్రమాదాలను సృష్టించనుందని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది చివరి నాటికి ఆర్థిక మాంద్యం చుట్టుముట్టనుందని భావిస్తున్నాయి. ట్రంప్‌ టారిఫ్‌ చర్యలు ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టబోతున్నాయని దిగ్గజ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జెపి మోర్గాన్‌ విశ్లేషించింది. ట్రంప్‌ చర్యల వల్ల అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశం 60 శాతానికి చేరుకుందని అంచనా వేసింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది చివరి నాటికి మాంద్యంలోకి ప్రవేశించే అవకాశం ఉందని విశ్లేషించింది. సంక్షోభం రావడానికి గతంలో 40 శాతం అవకాశాలుండగా.. ఇది ఇప్పుడు 60 శాతానికి చేరిందని పేర్కొంది.
యూఎస్‌ వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ప్రమాదంగా మారిందని తెలిపింది. ఈ పరిణామాలు స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)పై తీవ్ర పరిణామాన్ని చూపే అవకాశం ఉందని జిపి మోర్గాన్‌ సీఈఓ, ఆర్థిక నిపుణులు మైఖేల్‌ ఫెరోలి తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2025 చివరి నాటికి మాంద్యంలోకి జారుకోనుందన్నారు. ఫలితంగా ఉద్యోగ నష్టాలు తప్పవని తన నివేదికలో వెల్లడించారు. 2025 ద్వితీయార్థంలో జీడీపీ తగ్గుముఖం పడుతుందని తెలిపారు. మూడవ త్రైమాసికంలో 1 శాతం, నాలుగవ త్రైమాసికంలో 0.5 శాతం తగ్గుదల ఉంటుందని జెపి మోర్గాన్‌ అంచనా వేసింది. ఇది నిరుద్యోగానికి దారి తీయనుందని స్పష్టం చేసింది.
జెపి మోర్గాన్‌ రిపోర్ట్‌ ప్రకారం.. అమెరికాకు దీటుగా ఇతర దేశాలు వేసే టారిఫ్‌లతో యూఎస్‌లో వస్తు ధరలు 1-1.5 శాతం వరకు పెరుగుతాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరగనుంది. ఇదే విధానాలు కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ సృష్టి నిలిచిపోవడంతో పాటు, ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించొచ్చు. మాంద్యం వల్ల అమెరికాలో ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. ఆర్థిక సంక్షోభం వల్ల నిరుద్యోగ రేటు 5.3 శాతానికి పెరిగే అవకాశముంది. కొత్త ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. ఇందుకు ట్రంప్‌ విధిస్తున్న అధిక సుంకాలే ప్రధాన కారణం.
మరిన్ని సంస్థల హెచ్చరిక..
జెపి మోర్గాన్‌తో పాటు బార్క్లేస్‌, బోఫా గ్లోబల్‌ రీసెర్చ్‌, డ్యూష్‌ బ్యాంక్‌, యూబీఎస్‌ గ్లోబల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థలు ట్రంప్‌ చర్యలను తప్పుబట్టాయి. అధిక టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థను పతన దిశగా నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికే ఒత్తిడిలోకి జారుకున్నాయని హెచ్‌ఎస్‌బిసి పేర్కొంది. యూఎస్‌ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ కూడా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారిపోయే అవకాశాన్ని 35 శాతానికి పెంచింది. గోల్డ్‌మన్‌ సాచ్స్‌ వంటి కంపెనీలు అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లడం ఖాయమని ఇటీవలే పలు రిపోర్టులో తెలిపాయి.
40 ఏండ్ల కనిష్టానికి దిగుమతులు..
ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు చేసుకునే దిగుమతులు 20 శాతం కన్నా ఎక్కువగా పడిపోవచ్చని యూఎస్‌ ఆర్థికవేత్త జోనాథన్‌ పింగిల్‌ పేర్కొన్నారు. రాబోయే త్రైమాసికాల్లో దిగుమతుల స్థాయి 1986కు ముందు స్థాయి కనిష్టానికి క్షీణించొచ్చన్నారు. అంటే దాదాపు 40 ఏండ్ల కనిష్ట స్థాయికి దిగుమతులు పడిపోనున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ యూఎస్‌ ఫెడరల్‌ చైర్మెన్‌ జెరోమ్‌ పావెల్‌ సైతం ట్రంప్‌ విధిస్తున్న సుంకాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అధిక టారీఫ్‌లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ వాణిజ్య విధానంలో తీవ్ర సంక్షోభం చోటు చేసుకోవచ్చనే అంచనాల్లో ఇటీవల అమెరికా సహా ప్రపంచ మార్కెట్లన్నీ తీవ్ర పతనాన్ని చవి చూస్తోన్న విషయం తెలిసిందే.

Spread the love