సునామీ

Tsunamiఅనగా అనగా ఒక ధూపాళ రాజ్యం. వినగా వినగా ఒక భూపాళ రాజ్యం. రెండు రాజ్యాలూ పక్కపక్కనే వున్నా ఒక రాజ్యానికి ఇంకో రాజ్యం పక్కలో బల్లెమే. అనగా గాఢ శత్రుత్వమే. ధూపాళ రాజ్యం కాకులు, భూపాళ రాజ్యం కాకులు కూడా కావ్‌ కావ్‌ అనే అన్నా అక్కడి కాకులు ఇక్కడికి, ఇక్కడి కాకులు అక్కడికి రెక్కలూపుకుంటూ వెళ్లవు. ఆ రాజ్యం కాకి ఈ రాజ్యం వైపు ఎగిరిందంటే దాని జీవితం ఎక్ప్‌పైరీ అయినట్టే. ధూపాళ రాజ్యం కాకులు నల్లగానూ, భూపాళ రాజ్యం కాకులు సున్నం కొట్టినట్టు తెల్లగానూ వుండేవి. నిజంగానే భూపాళ రాజ్యం వాళ్లు వాళ్ల కాకులకు తెలుపు ఏషియన్‌ రంగును అద్ది, అవతలి వైపునుంచి వచ్చే నల్లకాకుల్ని శత్రుదేశం కాకులని గుర్తుపట్టడానికి ఏర్పాటు చేసుకున్నారు. రెండు రాజ్యాల మధ్య శత్రుత్వం ఈ స్థాయిలో వుండడం వల్ల ఆ రెంటిమధ్య ఎలాంటి రాకపోకలు, సంబంధ బాంధవ్యాలు వుండేవి కాదు. పలకరింపులంటే కత్తులతో పొడుచుకోవడమే కాని షేక్‌హాండిచ్చుకోవడం కాదు.
కాలం కడుపులో ఎన్ని చిత్రవిచిత్రాలు, ఎన్ని వింతలూ, విడ్డూరాలు దాక్కుని ఉంటాయో ఎవరూ చెప్పలేరు, ఊహించనూ లేరు. ఒకానొకనాడు ధూపాళ రాజకుమారుడు రెండు రాజ్యాల మధ్య వున్న అడవిలో వేటకని వెళ్లాడు.
దట్టమైన అడవి కనుక, ఇటువాళ్లటూ, అటువాళ్లిటూ బోర్డర్‌ గీత సరిగా కనపడక వచ్చిపోతుండడం జరిగేదే. అడవిలో పులికోసం తిరుగుతున్న ధూపాళ రాకుమారుడికి పులి కనపల్లేదు కానీ అటుగా వచ్చిన మెరుపుతీగ కనిపించి కళ్లు బైర్లు కమ్మినయి. ఒంట్లో నెత్తురు దిక్కులు మరిచిపోయి పరుగెత్తింది. ఈ సంఘటన జరిగిన ఎన్నోవందల ఏళ్ల తర్వాత విలియం షేక్స్‌పియర్‌ అనే ఆంగ్ల నాటకకర్త లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అనే మాట రాస్తాడని తెలీకుండానే, రాకుమారుడు మెరుపుతీగను చూసిన తొలి చూపులోనే క్లీన్‌ బౌల్డ్‌ అయిపోయాడు. వేట కాన్సిల్‌ చేసుకుని ప్యాలెస్‌కి తిరిగొచ్చి మంచాన పడ్డాడు.
ధూపాళం రాకుమారుడి మనసు ఏటియం పగలగొట్టి నిట్టనిలువునా దోచుకున్న ఆ మెరుపుతీగ శత్రురాజ్యం రాకుమారి. మంచాన పడ్డ కొడుకు సింహాసనం మీద కూచోవాలంటే మంచం దిగాలంటే, ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు ధూపాళరాజ్యం మహారాజు. మంచితండ్రీ, బాపు, డాడీ.
ఏదో ఒకటి జరిగిపోయింది. రెండు రాజ్యాల మధ్య శత్రుత్వం బ్లాక్‌ కరెంట్‌ అయిస్‌క్రీంలా కరిగిపోయింది. ఎన్నో ఏళ్ల శత్రుత్వం పుంజాలు తెంచుకుని పారిపోయింది. భూపాళం రాకుమారి ధూపాళం రాజ్యానికి మహారాణి అయింది. రాకుమారుడు సింహాసనం ఎక్కేశాడు. వీళ్లిద్దరి వివాహానికి దేవతలు బిజీగా వుంటాన రాలేకపోయేరేమోగానీ, వచ్చిన వాళ్లంతా పూలరెయిన్‌ కురిపించారు. భూపాళ రాజ్యం వారు కాకులకు తెల్లరంగు వెయ్యటానికి ప్రజల మీద వేసిన పన్ను తొలగించేశారు.
భూపాళం రాకుమారి, మహారాణి అయ్యేక రాబోయిన ఉగాది పండక్కి పతీపరమేశ్వర్‌ని ఒక కోరక కోరింది. వినడానికి విషయం కొత్తగా వుంది. ఉగాది పండగనాడు రాజదర్బార్‌లో కవిసమ్మేళనం ఏర్పాటు చెయ్యడం ఆమె కోరిక. భూపాళరాజ్యంలో ఉగాది నాడు ఎక్కడ చూసినా కవుల సందడే వుంటుందని, కవి సమ్మేళనాలతో రాజ్యం దద్దరిల్లిపోతుందని, తనకూ కొంచెం కవిత్వం రాసే అలవాటు వుందని రాణీగారు చెప్పడంతో రాజావారు అవాక్కయ్యాడు. తమ రాజ్యంలో ఎన్నో సంవత్సరాల క్రిందట కవిత్వాన్ని నిషేధించారని, ప్రస్తుతం రాజ్యంలో కవి అనే రెండక్షరాల పేరుకు ఓనర్‌నని చెప్పుకునే వారెవరూలేరని చెప్పలేకపోయాడు. లేకలేక రాణీగారు కోరితే కాదనగలనా అనుకున్నాడు.
మంత్రుల్నీ, సామంతుల్నీ, దండనాధుల్నీ అందరినీ సమావేశపరిచాడు. రాణీగారి కోరిక అని పైకి చెప్పకుండా మన రాజ్యంలో ఉగాదికి కవి సమ్మేళనం జరపకపోతే అది మన సంస్కృతికి గొడ్డలిపెట్టు అన్నాడు. చరిత్ర మనల్ని గురించి ఎంత మధనపడుతుందోనన్నాడు. సరస్వతీదేవి కంట నీరు పెడుతుందన్నాడు. రాజుగారి భావావేశంతో ఆస్థానంలోని వారి కళ్లు చెమర్చాయి. కొందరి బుగ్గలూ, మీసాలూ తడిశాయి. ఇన్నాళ్లూ మనం కల్చర్‌ను మరిచిపోయి బార్బేరియస్‌గా బతికేశాం అనుకున్నారు. నాగరికులమవుదాం అనుకున్నారు. ఉగాది కవి సమ్మళనం టముకు ఊరూరా వాడవాడలా బజాయించబడింది. అయితే ఎన్నేళ్ల నుంచో మూలన పడిన కలాలు కదలవని ఒక్కరంటే ఒక్కరు కూడా తమ పేరు నమోదు చేయించుకోలేదు. రాజుకి కాళ్లూ చేతులూ ఆడలేదు. నా రాజ్యంలో కవులే లేరా అని చింతాక్రాంతుడైనాడు. ఈ దఫా రాజసభలో కవిత్వం వినిపించడానికి వచ్చినవారికి శాలువాలు కప్పడం, సన్మానపత్రం ఇవ్వడం, కొందరికి బిరుదులు, కొందరికి పురస్కారాలు ఇవన్నీ కాక నగదు బదిలీలు కూడా ఉంటాయని ప్రచారం చేయించాడు. ఈ విషయాన్ని జనం సీరియస్‌గా తీసుకున్నారు. కవికంఠీరవ, కవిశార్దూల వంటి బిరుదులు తమ పేర్లకు తగిలించి చూసుకున్నారు. జరీ శాలువాలు, సన్మాన పత్రాల పెద్ద ఫ్రేమ్‌లు ఊహించుకున్నారు. ఇక కవులమయి తీరాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొందరు ఇళ్లల్లో పాత సందూకులు వెతకడం ఆరంభించారు. కొందరు అటకలెక్కి బూజు దులిపారు. చిన్న కాగితం ముక్క మీద నాలుగో ఆరో వాక్యాల కవిత దొరికితే, ఆ వాక్యాలనే తిరగేసి మర్లేసి మళ్లీ మళ్లీ రిపీటు చెయ్యవచ్చుననుకున్నారు. కొందరు ఇంట్లో పాతసామాన్లలా పడున్న ముసిలోళ్ల ఒళ్లో ఆప్యాయంగా కూచుని తాము ఇదివరకు విన్న పద్యాలో పాటలో చెప్పమని బతిమాలారు.
పెట్టెలూ, అటకలూ, మూలనున్న ముసలమ్మలూ, చుట్టపొగలు వదిలే సీనియర్‌ సిటిజన్లూ లాభం లేదని, కవిత్వం అదో బ్రహ్మవిద్యా! యాభైఆరు తెలుగు అక్షరాలు, ఒత్తులు, ఐత్వాలు, గుణింతాలు వస్తే చాలదా? స్వంతంగా కృషిచేస్తే అర్ధం వుంటేనేం లేకపోతేనేం ఓ పదో పాతికో వాక్యాలు డొక్కలోనుంచి తోడి బయటకు తీయలేకపోతామా అనుకున్నారు. ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. వాక్యాలన్నింటిలోనూ అక్షరాలు సమానంగా వుండాలని కొందరు, వాక్యాల్లో పదాల సంఖ్య సమానంగా వుండాలని కొందరు, వాక్యాల చివర పదాలు మ్యాచింగ్‌గా వుండాలని కొందరు సిన్సియర్‌గా ప్రయత్నం చేశారు. కొందరు పాత పుస్తకాలలోని పేరాల్లో వాక్యాల నడ్డి విరగ్గొట్టి విడదీసి పరిచారు. ఏది ఏమైతేనేం ధూపాళ రాజ్యంలో కవితాయుగం ఆరంభమైంది. రాణీగారి కోరిక తీరింది. కవిత్వం వినడం అలవాటు లేని జనం సభలో నుండి లేచిపోకుండా కుర్చీలకు కట్టేసి జాగ్రత్తపడ్డాడు ధూపాళ రాజు.
ఇలాగ ధూపాళ రాజ్యంలో కవితా సునామీ విజృంభించింది. వినేవాళ్ల సంఖ్య బక్కబలచన అయిందేమో కానీ కుల కవిత్వం, మత కవిత్వం, ప్రాంతీయ కవిత్వం, శాలువాలు, సత్కారాలు, పురస్కారాల పుణ్యమాని కవుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. నేటికీ ఈనాటికీ ధూపాళ, భూపాళ రాజ్యాలలో కొత్త కవులు పుట్టుకొస్తూనే వున్నారు.

Spread the love