ఇద్దరు మిత్రులు

ఇద్దరు మిత్రులుఉదయం లేచింది మొదలు పనే పని. క్షణం తీరిక లేని పని. ఇప్పుడు రాత్రి పదకొండు దాటింది. ఇప్పటికి విశ్రాంతి చిక్కింది. ఇదెంత సేపులే, ఓ అరగంట. ఆ తర్వాత మళ్లీ గానుగెద్దులా తిరగడమే అంటూ నిట్టూర్చింది అది.
నువ్వు నాతో చెప్పుకోడం, నేను నీతో చెప్పుకోడం. చెప్పుకున్నాక ఇలాగ నిట్టూర్చటం తప్ప ఏమీ చెయ్యలేం. మన చేతుల్లో ఏముంది గనుక. ఒకళ్ల చేతుల్లో బతికే బతుకాయె మనది అంటూ నిట్టూర్చింది ఇది.
మేలుకుని వున్న సమయంలో క్షణం కూడా వదిలిపెట్టరు మన యజమానులు. టీవీ చూస్తున్నా, బస్సులో వెళ్తున్నా, పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్నా ఆఖరుకి బాత్‌రూంలోకి కూడా మనల్ని లాక్కెళ్తారు. ఇంతకు మించి వెట్టిచాకిరీ ఎక్కడైనా వుంటుందా అన్నది అది.
వుండదు గాక వుండదు. పొరపాటున మన నుదుటి మీద ఎర్రగీత కనపడిందో, విసుక్కుంటూ, కసురుకుంటూ మనకింత తిండిపడేసి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసి లాక్కెళ్లిపోతారు అన్నది ఇది.
మనకింక నిద్ర ఎలాగూ పట్టిచావదు. కొంచెం కునుకు పట్టంగానే లేపి పట్టుకుపోతారు. వీళ్లు లేపకపోయినా అవతలివాడెవడో ఎక్కడ్నించో మన చెవులు పట్టుకులాగుతాడు. నొప్పి తట్టుకోలేక కేర్‌మంటాం, బేర్‌ మంటాం. అంతే! ఆవిడ ప్రపంచం మునిగిపోతుందన్నట్టు హడావిడిగా రానేవస్తుంది అని అది అంటే, ఈయనేం తక్కువా, ఒక్కసారి కేర్‌మంటానో లేదో భూమికంపించినట్టు, సునామీ ఎదురొచ్చినట్టు ఎగిరి నా మీదకు దూకుతాడు అని ఇది అంది.
అసలు నీ యజమానికి పనీపాటా ఏమీ లేదా? ఇరవైనాలుగ్గంటల్లో పద్దెనిమిది గంటలూ నిన్ను ఎందుకు హింస పెడ్తాడు అనడిగింది అది. అలవాటయిపోయింది మరి. నేను క్షణం కనపడకపోతే ఆ శాల్తీ పై ప్రాణాలు పైకే పోతయి. జేబులు వెదుకుతాడు, టేబుల్‌ వెతుకుతాడు, కప్‌బోర్డులో కాగితాల కట్టలు కిందకు దొర్లిస్తాడు. జుట్టు గోక్కుంటాడు, పీక్కుంటాడు అంది ఇది. నా యజమానురాలేం తక్కువ తిన్లేదు. నేను కనపడకపోతే వంటింట్లో గిన్నెలు సొట్టలు పడుతయి. బట్టలు ఆరేసిన దండెం తాడు తెగి కిందపడ్తుంది. అల్మరాలోంచి చీరల దొంతర్లు ‘వాకౌట్‌’ చేస్తయి. ముఖం ఎర్రబడుతుంది. ముక్కులు గాలిని ఎగపీలుస్తుంటయి. ఇల్లంతా పిచ్చెక్కిన దానిలా కదం తొక్కుకుంది అంది అది.
అసలు అస్తమానం మనల్ని ఊపుతూ, పిసుకుతూ తొక్కి నారతీస్తే వీళ్లకి ఏం ఆనందం వస్తుందో అన్నది ఇది. ‘ట్వంటీ ఫోర్‌ బై సెవెన్‌’ ఎంటర్‌టైన్‌మెంటు కదా ఇస్తాం మనం. నా సొంతదారయితే నన్ను నొక్కని క్షణం వుండదు. ఒక్కోసారి ఎందుకు నొక్కుతుందో తనకే తెలీదు. తనకు తెలీకుండానే నా మీద పడి కసాబిసా నొక్కేస్తుంటుంది. ఓ సారి వరుసగా చీరలూ, డిజైన్లూ, స్టీలు సామాను, టెర్రాకోట ఎర్రకుండ ఓసారి వరుసగా పనీర్‌ మటర్‌కర్రీ, జొన్నరొట్టెల తయారీ చూసి చూసి కళ్లు నీళ్లు కారుస్తాయనుకో. ఇన్ని వంటకాల రెసిపీలు చూస్తుందా కూర మాడకుండా చెయ్యదు, అన్నం అడుగంటకుండా వుండదు. దృష్టంతా పొయ్యి మీద కాక నామీదేనాయె మరి అని మొట్టమొదటిసారి నవ్వింది అది.
ఏడవేక నవ్వాల్సిందే మనం. నా యజమాని నన్ను నొక్కితే పీక నొక్కినట్టే అనిపిస్తుంది. కాసేపు క్రికెట్టు అంటాడు, కాసేపు సినిమా తార కథలంటాడు. గూగుల్‌ ముచ్చట్లంటాడు, వార్తలు, వింతలు విశేషాలంటాడు. చెవుల్లోకి పాటలు ఎక్కించుకుంటాడు. సరేలే వాడి బాధ వాడు పడుతున్నాడనుకుంటే, నాన్‌స్టాప్‌గా ఛండాలం అంతా చూస్తాడు. చెప్పాలంటే నాకే సిగ్గువేస్తుంది. అబ్బబ్బ లోకంలో ఇంతమురికీ, ఇంత చెత్తాచెదారం వుందనుకోలేదు నేను. పైగా తను చూసిన గలీజునంతా ఫ్రెండ్స్‌కి బట్వాడా చేస్తాడు. వాట్సప్పులూ, ఫేస్‌బుక్కులూ, లైకులూ వీడి పిండాకూడు… బూతులు వచ్చేస్తయి నాకు. ఏ పనిలో వున్నా దృష్టంతా నామీదే, నా పీక నొక్కడం మీదే అని నవ్వలేక ఏడుపు ముఖం పెట్టింది ఇది.
నీకైతే ఒక్క యజమాని పోరే. నాకు మాత్రం యజమాని కూతురు పోరు అదనం మరి. ఆ పిల్ల రాక్షసికి నేనంటే ఎంత చిన్నచూపో. మళ్లీ నేను లేకపోతే నోట ముద్దదిగదు. పాలు తాగదు, దోశముక్క కొరకదు. ఆ పిల్ల నోట్లోకి ఏ వేళ ఏది దూరాలన్నా నేను ఎదురుగ్గా వుండి తీరాల్సిందే. నన్ను ఇటు తిప్పీ అటు తిప్పీ నానా ఆగం చేస్తుంది. ఆ ఏడుపు తల్చుకుంటే చిరాకేస్తుంది. చేత్తో పట్టుకుని పైకీ కిందకీ ఊపుతుంది. ఎక్కడ కిందపడేసి చంపుతుందోనని తెగ భయపడి పోతాననుకో అంది అది.
మన తాత ముత్తాతలే హాయిగా వుండేవారు. ఒక్కచోట కూచుని ట్రింగు ట్రింగుమంటూ పనిచేసుకునేవారు. నవాబే కొండ దగ్గరికి పోయినట్టు జనం వారున్నచోటికే పరుగెత్తేవారు. డాన్సులూ, పాటలూ, బొమ్మలూ, వంటిల్లూ, ఉప్పు కారం, మసాలాలు ఏవీ అంటేవి కాదు. స్మార్ట్‌ స్మార్ట్‌ అని మనల్ని మునగచెట్టు ఎక్కించారు. ఓరు… ఓరు… ఓరు.. తెల్లవారుజామున ఎక్కడికో వెళ్లాలని అలారం పెట్టినట్టున్నాడు గురుడు. వుంటా.. సీయూ బై అంటూ ఐఫోన్‌ అలారం అరుపు లంకించుకుంది.
ఓరు.. ఓరు… ఓరు… ఆయనగారు టైంకి లేస్తారో లేదోనని, నాకూ అలారం పెట్టినట్టుందీవిడ. వుంటా రాత్రికి కలుద్దాం. బై అంటూ సాంసంగ్‌ అలారం కుయ్యోమొర్రో మొదలెట్టింది.
– చింతపట్ల సుదర్శన్‌
9299809212

Spread the love