చెట్టు విరిగిపడి ఇద్దరు దుర్మరణం..

నవతెలంగాణ – బొమ్మలరామారం

గాలి దుమారంతో కూడిన వర్షాల కారణంగా రోడ్డుపక్కన  చెట్లు విరిగిపడి రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని ఈదురు గాలులతో కూడిన వర్షానికి తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలోని కీసర నుండి షామీర్ పేట వైపు వెళ్లే రోడ్డు పక్కన చెట్లు విరిగి ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వెంటనే  ఇ సి ఐ ఎల్ లోని శ్రీకర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలానికి చెందిన నాగి రెడ్డి రామ్ రెడ్డి (48),ధనుంజయ (45) లుగా గుర్తించారు. మృతుడు ధనుంజయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడు కాగా, గత కొంతకాలంగా బొమ్మలరామారం మండలం ధర్మారెడ్డి గూడెంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. మృతులు శామీర్ పేట లోని ఓ న్యాయవాదిని కలిసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాలి దుమారం,ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఇలాంటి సమయంలో బయట ఎవరూ తిరగవద్ధని అధికారులు కోరుతున్నారు.
Spread the love