ఢిల్లీ నుంచి ఉద్దెర నాయకులు

– ఎంతమంది వచ్చినా.. జనాన్ని నమ్ముకున్నాం
– ఖానాపూర్‌, మంచిర్యాల సభల్లో మంత్రి కేటీఆర్‌
– ప్రధాని మోడీ పచ్చి మోసగాడని వ్యాఖ్య
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, జన్నారం
ఒక వైపు బీజేపీ.. మరో వైపు కాంగ్రెస్‌.. డిల్లీ నుంచి ఉద్దెర నాయకులను తెలంగాణకు తీసుకొచ్చి సీఎం కేసీఆర్‌ గొంతు నొక్కించే ప్రయత్నాలు చేస్తున్నా యని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఎంత మంది నాయకులు వచ్చినా.. తాము జనాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నామని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రాన్ని ఇలాంటి దరిద్రుల చేతిలో పెట్టకూడదని కోరారు. మంచిర్యాల జిల్లా ఖానాపూర్‌, మంచిర్యాల నియోజకవర్గాల ఎన్నికల సభ శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో జరిగింది. అంతకు ముందు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మంచి ర్యాల, ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దివాకర్‌రావు, జాన్సన్‌ నాయక్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వందల మంది బిడ్డల్ని పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్‌ పార్టీ అని, తెలంగాణ బిడ్డల రక్తం కండ్ల చూసిన కాంగ్రెస్‌కు ఓటేద్దామా అని ప్రశ్నించారు. ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 11సార్లు చాన్స్‌ ఇచ్చామని, ఈ 55 ఏండ్లలో ఆ పార్టీ ఏం చేసిందని అన్నారు. ప్రజలకు తాగు, సాగునీరు, కరెంటు ఇవ్వలేని కాంగ్రెస్‌ పార్టీ.. దరిద్రానికి నేస్తమని, అలాంటి పార్టీకి ఓటేసి నెత్తిన పెట్టుకుందామా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ పచ్చి గాడని.. జన్‌ధన్‌ ఖాతాలు తెరిచిన వారికి రూ.15లక్షలు ధన్‌ధన్‌ వేస్తామని చెప్పి వేయలేదని.. రూ.400 గ్యాస్‌ సిలిండర్‌ను రూ.1200 చేశారని విమర్శించారు. సీఆర్‌ సీఎం అయ్యే వరకు రైతును రాజును చేయాలనే ఆలోచన ఎవరైనా చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీడీ కార్మికులకు తొలిసారి పింఛన్లు ఇస్తున్నా మని, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తాము మళ్లీ అధికారంలోకి రాగానే కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో ప్రజలు ఎదుర్కొంటున్న ఆంక్షలు ఎత్తి వేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఉట్నూర్‌ జడ్పీటీసీ చారులత రాథోడ్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీ వెంకటేష్‌నేత, ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మెన్‌ రాథోడ్‌ జనార్దన్‌, సీనియర్‌ నాయకులు రవీందర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, పెంబీ జడ్పీటీసీ జానుబాయి, జన్నారం జడ్పీటీసీ ఎర్ర చంద్రశేకర్‌, ఎంపీపీ మాదాడి సరోజన పాల్గొన్నారు.

Spread the love